calender_icon.png 19 February, 2026 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం వర్రీ!

19-02-2026 01:44:45 AM

గోదాములు ఫుల్.. ఎగుమతికి అవకాశాలు నిల్ 

విదేశాలకు ఎగుమతి చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం

ప్రైవేటు వ్యాపారాన్ని ప్రోత్సహించి.. విదేశీ మారకద్రవ్యంపై దృష్టి సారించడమే మార్గం!

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న వరి ధాన్యం నిల్వలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు తలనొప్పిగా మారాయి. ఏటికేడు పెరిగిపోతున్న నిల్వలను ఎక్కడ దాచిపెట్టాలనేది సమస్యగా మారింది. ఆ నిల్వలను పక్క రాష్ట్రాల అవసరాలకు సరఫరా చేయడమో లేదా డిమాండ్ ఉన్న ఇతర దేశాలకు ఎగుమతి చేయడమో పరిష్కారంగా మారింది. అయి తే ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం లేకపోవడంతో, అధికార యంత్రాంగం తల బాదుకుంటున్నది. 

భారీగా ధాన్యం ఉత్పత్తి..

రాష్ట్రంలో ఏటికేడాది ధాన్యం ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. 2020-21 సీజన్‌లో మొత్తం 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా.. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 71.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మొత్తం 14.20 లక్షల మంది రైతుల నుంచి రూ. 18533 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

ఈ ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన మొత్తంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకం ధాన్యం  కాగా.. 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు ఉన్నాయి. సన్నరకాలకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తోంది. దీనితో రైతులు దొడ్డు రకాల నుంచి సన్న రకాలవైపు మళ్లుతున్నారు. దీంతో మన అవసరాలకు మించి భారీగా ధాన్యం ఉత్పత్తి అవుతోంది.

గోదాముల కొరత..

రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాము లు మాత్రమే ఉన్నాయి. ఇవికూడా కేంద్రం పరిధిలోని ఎఫ్‌సీఐ, రాష్ట్రంలోని గోదాముల విభాగం పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని గోదాములన్నీ నిండు కుండల్లా ఉన్నా యి. పైగా 2024-25 రబీ, 2025-26 ఖరీఫ్ సీజన్లకు సంబంధించిన ప్రభుత్వం సేకరించిన దొడ్డు రకం ధాన్యం, బియ్యం సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల వరకు గోదాముల్లో, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో, రేషన్ దుకాణాల్లో మూలుగుతున్నాయి. ఈ రబీలో మరో 12 లక్షల మెట్రికల్ టన్నుల బియ్యం రానున్నది. దీంతో రాబోయే రబీలో సేకరించే ధాన్యం ఎక్కడ నిల్వచేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

ఎగుమతికి లేని అవకాశం..

వాస్తవానికి రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే బియ్యాన్ని (సన్న రకాలు, దొడ్డు రకాలు) డిమాండ్ ఉన్న దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఇందుకు రెండు మార్గాలు ఉన్నా యి. ఒకటి, ప్రభుత్వమే సేకరించి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం.. లేదా ప్రైవేటు సంస్థలు, మిల్లర్లు సేకరించి ఎగుమతి చేయడం. అయితే ప్రభుత్వపరంగా ఎగుమతికి అవకాశం లేదు. ఎందుకంటే.. ఇందుకు ప్రత్యేకంగా ఒక విభాగం ఉండాలి.

ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఆదిశగా ఆలోచించడం లేదు. అంటే ఇక ఉన్న ఏకైక మార్గం.. ప్రవేటు రంగం. కానీ అక్కడకూడా అనుకూల పరిస్థితులు లేవు. ఎందుకంటే.. ప్రైవేటుగా ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వమే పూర్తిగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసి.. మిల్లర్లకు అప్పగించి మిల్లింగుచేసి బియ్యాన్ని సేకరిస్తోంది. దీనితో ప్రైవేటు వారికి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం చిక్కడం లేదు.

ఒడిశా మోడల్..

ఒడిశాలో కూడా ధాన్యం ఎక్కువగానే పండుతోంది. అయితే అక్కడి ప్రభుత్వం వినూత్నంగా చర్యలు తీసుకుంది. అక్కడ ఎకరానికి 20 క్వింటాళ్ళ వరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అంత వరకే బోనస్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువగా పండిన ధాన్యాన్ని ప్రవేటు మార్కెట్లో రైతులు విక్రయిస్తున్నారు. అక్కడ సాధారణ రకం క్విం టాలు ధాన్యాన్ని ప్రభుత్వం రూ. 2,369కి కొనుగోలు చేయగా.. గ్రేడ్ ఏ రకం ధాన్యాన్ని రూ. 2,389కి కొనుగోలు చేస్తోంది.

దీనికి అదనంగా బోనస్ కింద క్విం టాలుకు రూ. 800 ఇస్తోంది. ఇలా 20 క్విం టాళ్ల వరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక్కో రైతుకు సంబంధించి 150 క్వింటాళ్ళ వరకే కొనుగోలు చేస్తోంది. అంటే 7.5 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఎక్కువగా లాభం కలిగేలా  అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. అంతకంటే పెద్ద రైతులు మిగిలిన ధాన్యాన్ని ప్రైవేటుగా బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాల్సిందేనన్నమాట. 

లాభాలు..

ఒడిశా మోడల్ వల్ల ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు సరిపోయినంత మాత్రమే ధాన్యా న్ని కొనుగోలు చేసి రేషను దుకాణాలకు సరఫరా చేస్తుంది. మిగిలిన ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలుచేసి బియ్యంగా మార్చి.. ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని అర్జిస్తోంది. అంటే ఇటు రాష్ట్రా అవసరాలను తీర్చడంతోపాటు.. విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల ఎటువంటి సమస్య ఎదురవ్వడం లేదు. కొన్నిసార్లు చిన్నపాటి సమస్యలు వచ్చినా.. వ్యవస్థ ను మరింత బలోపేతం చేస్తూ.. సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో..

మన రాష్ట్రంలో ధాన్యం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా ఉన్నా, దానిని రైతుల నుంచి పూర్తిగా ప్రభుత్వే కొనుగోలు చేస్తుండటంతో ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం దొరకడం లేదు. దీనితో మిల్లర్ల వద్ద మాయాజాలం నడుస్తోంది. ప్రభుత్వం పంపించిన ధాన్యా న్ని మిల్లింగ్‌చేసి బహిరంగ మార్కెట్లో అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. దీనిని రికవ రీ చేయడం కష్టంగా ఉంది. పైగా బోనస్ విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయడంకూడా కష్టంగా ఉంది.

ఈనేపథ్యంలో ఒడిశా మోడల్‌ను పరిశీలిస్తే ఎలా ఉంటుందనే కోణంలో నిపుణులు ఆలోచిస్తున్నారు. ఎకరానికి నిర్దిష్టమైన పరిమాణం లో ధాన్యం కొనుగోలుచేసి, చిన్న, సన్నకారు రైతులకు పూర్తి లాభం కలిగేలా బోనస్ ఇస్తే.. మిగిలిన ధాన్యం, పెద్ద రైతులు ప్రైవేటు మార్కెట్లో ధాన్యాన్ని అమ్ముకుంటారు. దీని వల్ల గోదాముల కొరత తలెత్తదు.

పైగా ప్రైవేటుగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకా శం కలుగుతుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని రాబట్టుకోవచ్చు. ఇన్ని లాభాల నేపథ్యంలో ఒడిశా మోడల్‌ను పరిశీలిస్తే.. అటు గోదాముల కొరత.. ఇటు ఎగుమతి లేమిని నివారించడంతోపాటు.. చిన్న, సన్నకారు రైతులకు పూర్తిస్థాయిలో బోనస్‌ను చెల్లించడంవల్ల రైతుకు లాభం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

కేరళకు కేంద్రం లేఖ..

బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడానికి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడానికి, కేంద్ర, రాష్ట్రాల మధ్య బియ్యం సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా ఉండటానికి ‘బోనస్’ను నిలిపివేయాలని కేంద్రం, కేరళ ప్రభుత్వానికి లేఖ రాసింది. క్వింటాలుకు రూ. 630 చొప్పున అక్కడి ప్రభుత్వం ఇస్తున్న బోనస్‌ను ఉపసంహరించుకోవాలని కేంద్రం కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బోనస్‌ను పూర్తిస్థాయిలో ఇవ్వడం వల్ల పంట ఉత్పత్తి అధికమవుతోంది.

దీని కారణంగా నీటి వినియోగం, ఎరువుల వినియోగం పెరుగుతోంది. దీనితో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. నేల నాణ్యత క్షీణిస్తోంది. జీవ వైవిధ్యం, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో వరి, గోధుమ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు తక్కువగా ఉంది. దీనితో ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈనేపథ్యంలోనే ధాన్యానికి ఇచ్చే బోనస్‌ను ఉపసంహరించు కోవాలని సూచించింది.