calender_icon.png 19 February, 2026 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి పన్ను వసూళ్లలో సైబరాబాద్ టాప్

19-02-2026 01:41:33 AM

  1. మూడు కార్పొరేషన్ల పరిధిలో రూ.1,995 కోట్ల పన్ను వసూలు 
  2. రూ.812 కోట్లతో మొదటి స్థానంలో సైబరాబాద్.. రెండో స్థానంలో జీహెచ్‌ఎంసీ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర అభివద్ధిలో కీలకమైన ఆస్తి పన్ను వసూళ్లలో కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  తన పేరుకు తగ్గట్టుగానే దూసుకుపోతోంది. మూడు కార్పొరేషన్ల విభజన తర్వాత జరుగుతున్న మొదటి ఆర్థిక సంవత్సరపు వసూళ్లలో సైబరాబాద్ అగ్రస్థానం లో నిలిచింది.

గ్రేటర్ హైదరాబాద్ ,సైబరాబాద్ ,మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కలిపి ఇప్పటి వరకు రూ. 1,995 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది నవంబర్ 25న 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసిన తర్వాత, ఈ ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యాన్ని అధికారులు రూ. 2,200 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు పెంచారు.

సైబరాబాద్ హవా.. జోన్లలో ఖైరతాబాద్ జోరు..

మూడు కార్పొరేషన్ల వారీగా చూస్తే, రూ. 812 కోట్ల కలెక్షన్‌తో సైబరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, రూ. 748.9 కోట్లతో జీహెచ్‌ఎంసీ రెండో స్థానంలో, రూ. 433.1 కోట్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక 12 జోన్ల వారీగా పరిశీలిస్తే, ఖైరతాబాద్ జోన్ రూ. 343.4 కోట్ల వసూళ్లతో అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత కూకట్‌పల్లి రూ. 317 కోట్లు, శేరిలింగంపల్లి రూ. 313 కోట్లు జోన్లు పోటాపోటీగా వసూళ్లు సాధించాయి. చార్మినార్ జోన్ రూ. 54.1 కోట్లతో అత్యంత తక్కువ వసూళ్లు నమోదు చేసింది.

పెరిగిన పీటీఐఎన్‌లు.. ముగియనున్న గడువు..

పట్టణ స్థానిక సంస్థల విలీనంతో ఆస్తి పన్ను ఇండెక్స్ నెంబర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో 19.5 లక్షల పీటీఐఎన్లు ఉండగా, విలీనంతో అదనంగా మరో 3.5 లక్షలు చేరాయి. ప్రస్తుతం మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం పీటీఐఎన్ల సంఖ్య 23 లక్షలకు చేరింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 41 రోజులు మా త్రమే మిగిలి ఉన్నాయి.

నిర్ణయించిన రూ. 3,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ తక్కువ వ్యవధిలో ఇంకా రూ. 1,005 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. గతేడాది 2024 రూ. 2,000 కోట్ల టార్గెట్‌కు గాను రూ. 2,038 కోట్లు వసూలు చేసి అంచనాలను మించిన అధికారులు.. ఈ ఏడాది కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొండి బకాయిల కోసం ఓటీఎస్ స్కీమ్ 

పెండింగ్‌లో ఉన్న మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఆస్తి పన్ను బకాయిలపై పడిన వడ్డీలో ఏకంగా 90 శాతం మాఫీ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.