26 June, 2026 | 3:32 AM

పూర్తి పారదర్శకతతో సర్ సర్వే

26-06-2026 01:02 AM

భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట 

భద్రాచలం, జూన్ 25 (విజయక్రాంతి): పారదర్శక ఓటర్ జాబితా కోసం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియలో సంబంధిత ఓటర్లు బి ఎల్ ఓ లు అందించిన ఎన్యుమరేషన్ పారాలలో పూర్తిస్థాయి వివరాలు పొందుపరిచి తిరిగి బిఎల్‌ఓ లకు అందించి దానికి సంబంధించిన రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ , భద్రాచలం నియోజకవర్గం ఈ ఆర్ ఓ మృనాల్ శ్రేష్ట  ఓటర్లకు సూచించారు.

గురువారం  భద్రాచలం పట్టణంలోని అయ్యప్ప కాలనీలోని 158 వ పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్లకు ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు అందించి ఓటర్లకు సూచనలు, సలహాలు ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైనందన్నారు. 

బి ఎల్ ఓ , బిఎల్‌ఏలు వారి పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు అందించినప్పుడు తప్పనిసరిగా సంబంధిత ఇంటి యజమాని కుటుంబ సభ్యుల వివరాలు, అర్హులైన వారికి ఓటర్ నమోదు చేయించాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారం పూరించేటప్పుడు ఓటర్లు తప్పనిసరిగా ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా  ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తహసిల్దార్ శ్రీమతి వినయ్ శీల శ్రీరామ్, బిఎల్‌ఓ రమేష్, సూపర్వైజర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు.