26 June, 2026 | 3:33 AM

ప్రైవేటు, సీబీఎస్‌ఈ విద్యాసంస్థల్లో స్పెషల్ టీచర్లను నియమించండి

26-06-2026 01:03 AM

నిబంధనలను ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయండి

జవహర్‌నగర్, జూన్ 25 (విజయక్రాంతి): ప్రైవేట్, సీబీఎస్‌ఈ విద్యాసంస్థల్లో స్పెషల్ టీచర్లను తప్పనిసరిగా నియమించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసం స్థల గుర్తింపును రద్దు చేయాలని వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆయన, ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు కే. వెంకట్ కలిసి శ్రీ శిశు, వికలాంగుల సంక్షేమ మరియు వయోవృద్ధుల శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్కు వినతిపత్రం సమర్పించారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం2016 మరియు సంబంధిత ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు సమగ్ర విద్యతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచాలని కోరారు.

అలాగే సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు తగిన విద్యా సౌకర్యాలు కల్పించి, స్పెషల్ ఎడ్యుకేటర్లు, రిసోర్స్ టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, సహాయ టీచర్ల పోస్టుల భర్తీలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరగా, ఈ అంశాలపై శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.