27 June, 2026 | 1:32 AM

రేవంత్ ప్రభుత్వానికి అర్ధాయుష్షే

27-06-2026 12:25 AM

జీవో 09ను రద్దు చేయాలి

ప్రభుత్వ స్కూల్‌కు రంగులు పూసి గొప్పలు పోతున్న సీఎం

బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ.జీవన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ కాలపరిమితి సగం ముగిసిపోయిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అర్ధ ఆయుష్షు మాత్రమే మిగిలిందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ.జీవన్‌రెడ్డి విమర్శించారు. జీవో 09ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డా రు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్ నాయక త్వంలో విద్యార్థులు తెలంగాణ వచ్చేందుకు బాటలు వేశారని గుర్తు చేశారు. రెండు పర్యాయాలు కేసీఆర్ విద్యా అవకాశాలు మెరుగు పరిశారని, రాజశేఖర్ రెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగించారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో విఫలమయ్యిందన్నా రు. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ 10 వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారని, కళాశాలలకు ప్రభుత్వం చెల్లింపు లేకుండా జీవో 09 తెచ్చారని, అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థులు ఫీజు చెల్లింపు చేసుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యను మెరుగుపరుస్తామని చెప్పి, విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖమంత్రిగా కొనసాగుతూ.. ఒక్క గురుకుల పాఠశాల నిర్మించలేదని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో సమయం వృధా చేస్తున్నారని విమర్శించారు. ఆరుట్ల ప్రభుత్వ స్కూల్ కు రంగులు పూసి గొప్పలు చెప్పుకుంటున్నారని, రాజీవ్ గాంధీ పేరును చులకన చేస్తున్నారని టి. జీవన్‌రెడ్డి మండిపడ్డారు.