ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం
- గ్రీవెన్స్కు వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి
- ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలి
- అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలి
- అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి
- మంత్రి సీతక్క
గోవిందరావుపేట, ఆగస్టు 17 (విజయ క్రాంతి): ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని, మండల ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం తెలియజేయాలని,ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని,అత్యవసర సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని, ప్రజలను సమస్యలను పరిష్కరించడంలో అధికారులు కాలయాపన చేయకూడదని, ఒంటరి మహిళలు, వితంతువుల, వికలాంగుల పింఛన్ దరఖాస్తులను 31లోగా స్వీకరించాలని, స్థానిక అధికారులు మారుమూల గ్రామాలు, గూడేల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే గ్రీవెన్స్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి సమస్యలకు పరిష్కారం చూపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
సోమవారం గోవిందరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చే ప్రజల నుంచి దరఖాస్తులను క్రమపద్ధతిలో స్వీకరించాలని, స్థానికంగా పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను సంబంధిత జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించి వాటిపై సమాధానం తెప్పించి దరఖాస్తుదారులకు తెలియజేయాలని అన్నారు. గ్రీవెన్స్కు వచ్చే ప్రతి దరఖాస్తుదారుడి సెల్ఫోన్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలన్నారు.
సమస్య పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలియజేయడంతో పాటు, నిర్ణీత సమయంలో దరఖాస్తు పరిష్కారమైందా లేదా, పరిష్కారం కాకపోతే కారణం ఏమిటనే విషయాన్ని సంబంధిత వ్యక్తికి స్పష్టంగా తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రజలు ఒకే సమస్య కోసం పదేపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. మండలాల వారీగా గ్రీవెన్స్ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడం ద్వారా జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల సంఖ్య తగ్గడంతో పాటు స్థానికంగానే సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
అధికారులు విధులను బాధ్యతగా, చిత్తశుద్ధితో నిర్వహించి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కార దిశగా పరిశీలించాలని సూచించారు. ఒంటరి మహిళలు, వితంతువులకు, సంబంధించిన పింఛన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా అన్ని గ్రామాల నుంచి పూర్తిస్థాయిలో స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలు, అంతర్గత వాడలు, గూడేల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు.
పస్రా, గోవిందరావుపేట, చల్వాయి తదితర ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని, ఎస్టీ తండాలు, గూడేల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 50 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అంతర్గత, సీసీ రహదారుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, తహసిల్దార్ సృజన్ కుమార్, ఎంపీడీవో వరుణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు






