జల వివాదాలకు ముగింపు ఎప్పుడు?
- కృష్ణా, గోదావరి జలాలపై తేలని పంచాయితీ
- బోర్డు సమావేశాలకు వరుస వాయిదాలు
- పెండింగ్‌లో కీలక నిర్ణయాలు
- ప్రాజెక్టులపై కొరవడిన స్పష్టత
- బలిపీఠంపై తెలంగాణ ప్రయోజనాలు
- కేంద్ర జోక్యం అత్యవసరమంటున్న నిపుణులు
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రా ంతి) : ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదాలకు తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. జల హక్కులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, ఉమ్మడి ప్రాజెక్టుల పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన నదీ యాజమాన్య బోర్డులు.. సమావేశాలను వరుసగా వాయిదాలు వేయటం అనిశ్చితి నెలకొంది.
కీలక నిర్ణయాలు పెండింగ్‌తో తెలంగాణ ప్రయోజనాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. సమావేశాల వాయిదాలకు కారణం? నిర్ణ యాల్లో జాప్యం ఎవరికి అనుకూలంగా మారనుంది? ప్రాజెక్టుల విషయంలో స్పష్టత ఎప్పుడు వస్తుంది? జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం ఇకనైనా జోక్యం చేసుకుంటుందా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా సాగు అవసరాలు, ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాల్లో నిర్ణయాలు ఆలస్యం కావడం వల్ల ఏటా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఫలితంగా తెలంగాణ జల హక్కులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోర్డులు ఇకనైనా వాయిదాలకు ముగింపు పలికి.. పెండింగ్ అంశాలపై కాలపరిమితితో నిర్ణయాలు తీసుకోకపోతే చివరికి తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలపైనే ప్రభావం పడే ప్రమాదం ఉందన్న ఆయా వర్గాల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ ప్రయోజనాలపై ఆందోళన
కృష్ణా, గోదావరి జలాలపై కీలక నిర్ణయాలు పదేపదే వాయిదా పడుతుండటంతో తెలంగాణ ప్రయోజనాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ నెల 13న కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా దానిని 17వ తేదీకి వాయిదా వేశారు. దానిని మరోసారి వాయిదా వేస్తూ 24న నిర్వహించనున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా జీఆర్‌ఎంబీ సమావేశం ఈ నెల 18వ తేదీన జరగాల్సి ఉండగా దాని కూడా వాయిదా వేసి తర్వాత సమావేశానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేయనట్టు తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, ఉమ్మడి ప్రాజెక్టులపై నియంత్రణ వంటి అంశాల్లో స్పష్టత రావాల్సి ఉన్నా.. బోర్డు సమావేశాలు వాయిదా పడటం వల్ల నిర్ణయ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. తెలంగాణకు సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం కృష్ణా, గోదావరి జలాలు కీలకం.
ఈ నేపథ్యంలో జల హక్కులకు సంబంధించిన అంశాలపై ఆలస్యం జరగడం రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపుతున్నారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాగు సీజన్‌లో ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు విడుదల చేయాలి?, నీటి కొరత ఏర్పడితే ప్రాధాన్యత ఎలా నిర్ణయించాలి?, రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగాన్ని ఎలా పర్యవేక్షించాలి? వంటి అంశాల్లో స్పష్టమైన విధానం అవసరం.
స్పష్టత అవసరం
ప్రాజెక్టులపై ఒక రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయడం, మరో రాష్ట్రం తన అవసరాలను ప్రస్తావించడం సాధారణంగా మారింది. అయితే ప్రతీ సారి వివాదం రాజకీయ ఆరోపణలకు దారితీయకుండా బోర్డు స్థాయిలో సాంకేతిక, చట్టపరమైన అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి కొలతలు, విడుదలల పర్యవేక్షణలో స్పష్టమైన విధానం ఉండాలి.
బోర్డు సమావేశాలు వాయిదా పడటంతో ప్రాజెక్టులకు సంబంధించిన అనేక అంశాలు కూడా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రాజెక్టులపై స్పష్టత లేకపోతే నీటి వినియోగంపైనా, భవిష్యత్ ప్రాజెక్టుల ప్రణాళికలపైనా అనిశ్చితి కొనసాగుతుంది. ఒక రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టు లేదా నీటి వినియోగంపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తే ఆ వ్యవధిలో జరుగుతున్న కార్యకలాపాలపై స్పష్టమైన నియంత్రణ ఉండకపోవచ్చు.
అదే సమయంలో మరో రాష్ట్రం తన హక్కులు, అభ్యంతరాలపై నిర్ణయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నిర్ణయం ఆలస్యం కావడం కూడా పరోక్షంగా ఒక ప్రయోజనంగా మారుతోందా? అనే సందేహాలు ప్రజల్లో, నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందే!
గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతున్న వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని అంశాలు బోర్డు సమావేశాల్లో పదేపదే వాయిదా పడుతుండటంతో.. సమస్యలు పరిష్కారం కాకుండా మరింత కాలం పెండింగ్‌లో ఉండే పరిస్థితి ఏర్పడుతోంది.
బోర్డు సమావేశాలు సకాలంలో జరిగేలా చూడటంతో పాటు.. పెండింగ్‌లో ఉన్న నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, ప్రాజెక్టులపై అభ్యంతరాలు వంటి అంశాలపై కాలపరిమితితో నిర్ణయాలు తీసుకునేలా కేంద్రం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతున్న సందర్భంలో కేవలం సమావేశాలు నిర్వహించడం, వాయిదా వేయడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన జల హక్కులు, ప్రాజెక్టుల నీటి అవసరాలు, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాల్లో స్పష్టత లేకపోవడం భవిష్యత్‌లో మరిన్ని వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వివాదాస్పద అంశాలకు గడువుతో కూడిన పరిష్కార మార్గాన్ని రూపొందించకపోతే గోదావరి, కృష్ణా జల వివాదాలు మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






