18 August, 2026 | 3:06 AM

డబ్బుల కోసమే నా టికెట్ మార్చారు

18-08-2026 01:21 AM
  1. మేఘారెడ్డి వనపర్తి టికెట్ కొనుక్కున్నారు
  2. పరిస్థితి ఇలాగే ఉంటే జీవన్‌రెడ్డిలా తిరగబడతా
  3. సొంత పార్టీపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు
  4. వనపర్తి కాంగ్రెస్‌లో మరోసారి బహిర్గతమైన విభేదాలు

వనపర్తి, ఆగస్టు 17 (విజయక్రాంతి): వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి చిన్నారెడ్డి.. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గోపాల్‌పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన మాట్లాడినట్లు చెపుతున్న వీడియోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

తనకు తొలుత కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించినప్పటికీ, చివరి నిమిషంలో టికెట్‌ను మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులకు ఆశపడి తన టికెట్‌ను పక్కన పెట్టారని ఆరోపించారు. తన 48 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఒక్క నిర్ణయంతో కిందపడేశారని వ్యాఖ్యానించారు. తాను ఏడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి మూడుసార్లు విజయం సాధించానని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాను నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగిన సమయంలో ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు ఓటు వేస్తామని చెప్పారని తెలిపారు. అయినప్పటికీ తనకు బదులుగా మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారని అన్నారు. ‘నాకే టికెట్ ఇచ్చి ఉంటే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయ్యేవాడిని. ఈరోజు వనపర్తి నియోజకవర్గం మహర్దశ మారేది. నేను పడిపోతే పడిపోతాను. కానీ వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు’ అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

మేఘారెడ్డి టికెట్ కొనుక్కున్నారు

మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారని చిన్నారెడ్డి ఆరోపించినట్లు ప్రచారం జరుగుతోంది. సోనియాగాంధీ తనకు టికెట్ ఇచ్చి, డబ్బులు లేకపోతే పార్టీ తరఫున ఖర్చు చేసి గెలిపించాలని అప్పటి పార్టీ నాయకత్వానికి సూచించినప్పటికీ, డబ్బులకు ఆశపడి టికెట్ మార్చారని ఆయన ఆరోపించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత నాయకుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

అభివృద్ధిని అడ్డుకుంటున్న మేఘారెడ్డి!

వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు నిలిచిపోయాయని మంత్రులను కలిసి ప్రశ్నించినప్పుడు, ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నారని వారు చెప్పినట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టులు తన అనుచరులకు దక్కలేదనే కారణంతో పనులు నిలిపివేయాలని, కాంట్రాక్టులు రద్దు చేయాలని ఎమ్మెల్యే చెబుతున్నారని మంత్రులు తనకు తెలిపినట్లు ఆయన చెప్పినట్లు సమాచారం.

జీవన్‌రెడ్డిలా తిరగబడాల్సి వస్తుంది

తన అనుచరులను కూడా మేఘారెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి తరహాలో తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని, ‘పార్టీలోనే ఉండి మేఘారెడ్డి లాంటి తప్పుడుగాళ్లను పార్టీ నుంచి తరిమేస్తాను’ అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

వనపర్తి కాంగ్రెస్‌లో చిన్నారెడ్డి, మేఘారెడ్డి వర్గాల మధ్య విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత చిన్నారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ప్రకటించి, అనంతరం తూడి మేఘారెడ్డికి మార్చిన విషయం కూడా అప్పట్లో వార్తల్లోకి వచ్చింది.

తాజాగా చిన్నారెడ్డి చేసినట్లు ప్రచారం అవుతున్న వ్యాఖ్యలు మరోసారి వనపర్తి కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలను తెరపైకి తెచ్చాయి. టికెట్ మార్పు, అభివృద్ధి పనులు, పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తదితర అంశాలపై ఆయన చేసిన ఆరోపణలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.