కేసీఆర్ సంకల్పం.. రేవంత్ ప్రారంభం
- వివాదాల నడుమా ఎట్టకేలకు అందుబాటులోకి సనత్‌నగర్ టిమ్స్
- పేదలకు కార్పొరేట్ వైద్యంపై ఆశలు
- మరోవైపు నాణ్యతా లోపాలు, క్రెడిట్ వార్‌పై రాజకీయ సెగ
రంగారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించే లక్ష్యంతో నిర్మించిన ‘డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్’ (సనత్‌నగర్/ఎర్రగడ్డ టిమ్స్) సోమవారం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ మెగా ఆసుపత్రి ప్రారంభం కాగా, ఒకవైపు అత్యుత్తమ వైద్యసేవలపై హర్షం వ్యక్తమవుతుంటే, మరొకవైపు రాజకీయ ఆరోపణలు, నాణ్యతా వివాదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
కేసీఆర్ హయాంలో శంకుస్థాపన
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ 2022 ఏప్రిల్ 26న రూ.1,070 కోట్ల వ్యయంతో ఎర్రగడ్డ ఛాతి దవాఖాన ప్రాంగణంలో (జీ14 అంతస్తులు) ఈ దవాఖానకు శంకుస్థాపన చేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగిందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కేసీఆర్ కట్టిన భవనానికి కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్ చేస్తోంది అని బీఆర్‌ఎస్ ఆరోపించగా, గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన పనులను, అంచనాలను సరిదిద్ది పూర్తి చేశాం అని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
వైద్య పరికరాల నాణ్యతపై విమర్శలు
టిమ్స్ దవాఖానలో పరికరాల కొనుగోలు ప్రక్రియలో తీవ్ర నాణ్యతా లోపాలు ఉన్నాయనే ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చురీ, ప్రాసెస్ విభాగాల కోసం గుర్తింపు లేని లోకల్ బ్రాండ్ల సామగ్రిని సేకరించడం వల్లే ఆరంభంలో డీఎమ్ ఈ అనుమతుల్లో జాప్యం జరిగిందని ప్రచారం జరిగింది. కాగా సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహల మధ్య సమన్వయ లోపం ఉందన్న వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. కానీ ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. కేవలం సాంకేతిక కారణాలు, లైసెన్సింగ్ ప్రక్రియ వల్లే ప్రారంభ తేదీలు వాయిదా పడ్డాయని స్పష్టం చేశాయి.
విడతల వారీగా 1,082 పడకలు
మొత్తం 1,082 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రజలకు త్వరగా సేవలు అందించేందుకు అధికారులు విడతల వారీ ప్రణాళికను సిద్ధం చేశారు. మొదటి విడతగా 582 పడకలను తక్షణమే అందుబాటులోకి తెచ్చారు. రెండో విడతలో మిగిలిన 500 పడకల పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఈ దవాఖానలో కార్డియాక్, నెఫ్రాలజీ-యూరాలజీ, ట్రామాకేర్‌తో పాటు ప్రత్యేకంగా ‘అవయవ మార్పిడి’ (ఆర్గాన్ ట్రాన్సప్లాంట్ ) చికిత్సలను ప్రధానంగా అందించనున్నారు. వీటితో పాటు మరో 37 ప్రత్యేక వైద్య విభాగాలు నిమ్స్ తరహా స్వయంప్రతిపత్తితో పేద రోగులకు వరప్రదాయినిగా నిలవనున్నాయి.
టిమ్స్ నామకరణంపై రాజకీయ దుమారం
సనత్‌నగర్ టిమ్స్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై రాష్ర్టంలో తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ రాష్ర్టం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను, పోరాటాలు చేసిన బీసీ నాయకులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
రాష్ర్టంలో ప్రాజెక్టులు, ప్రభుత్వ సంస్థలకు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లే పెడుతున్నారని, ఇది బహుజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని నిరసన వ్యక్తం చేశారు. సనత్‌దీతిజిజినగర్ టిమ్స్‌కు తెలంగాణ పోరాట వీరులైన ‘పండుగ సాయన్న’ లేదా ‘సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ‘పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ అంశంపై ఇతర బహుజన సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి కూడా మద్దతు లభించింది. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి వహించిన పాత్రను, ఒక వైద్యుడిగా, ఉమ్మడి ఏపీ సీఎంగా ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూనే ఈ ఆసుపత్రికి ‘డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్’గా నామకరణం చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది.






