18 August, 2026 | 3:27 AM

సర్ ముసాయిదా విడుదల

18-08-2026 01:40 AM
  1.    2.64 కోట్ల మందితో జాబితా 
  2. ఏఎస్‌డీ 73 లక్షలు, అన్‌మ్యాప్డ్ 92 లక్షల మంది ఓటర్లు 
  3. అన్‌మ్యాప్డ్ ఓటర్లందరికీ నోటీసులు 
  4. సెప్టెంబర్ 16లోగా సమాధానం ఇవ్వాలి 
  5. ఫామ్-6ఏతో ఓటు నమోదుకు అవకాశం 
  6. సీఈవో సుదర్శన్‌రెడ్డి వెల్లడి 
  7.  ఈసీఐ వెబ్‌సెట్‌లో ఓటర్ల ముసాయిదా జాబితా

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాం తి) : తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 3.38,26,448 ఓటర్లు ఉండగా, ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించిన 2,64,87,214 మంది పేర్లతో ముసాయిదా జాబితా రూపొందించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో 73 లక్షల మంది ఏఎస్‌డీ  (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్) జాబితాలో ఉన్నారని, మరో 92 లక్షల మంది అన్‌మ్యాప్డ్ జాబితాలో ఉన్నారని వెల్లడించారు. అన్‌మ్యాప్డ్ జాబితాలో ఉన్న వారందరికీ  నోటీసులు జారీ చేస్తున్నామని, వీరంతా సెప్టెంబర్ 16 లోగా సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ తర్వాత రాష్ట్రంలో 78.03 శాతం మంది ఓటర్లు ఉన్నారని, ఓటరు జాబితాలో పేరు లేని వారు ఫామ్-6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నోటీసులను పోస్టు ద్వారా పంపి బీఎల్‌ఓల ద్వారా అందజేస్తామని వెల్లడించారు.  

పార్టీలతో సీఈవో సమావేశం

ముసాయిదా ఓటరు జాబితాకు ముందు రాజకీయపార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తదుపరి కార్యాచరణపై వారికి వివరించారు.  ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.    

ప్రారంభమైన అభ్యంతరాల స్వీకరణ

 సర్‌లో భాగంగా సోమవారం నుంచి నోటీసుల జారీ, అభ్యంతరాల స్వీకరణ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చిన వారిలో సుమారు 32.36 లక్షల మంది  2002 సర్ వివరాలను ప్రస్తావించలేదని అధికారులు తెలిపారు. తమ వివరాలు లేదా కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వకపోవడం వల్ల అన్‌మ్యాపింగ్ ఓటర్లుగా పేర్కొంటూ వారందరికీ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేయనుంది.

మరో 61 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాల్లో 2002 ఎస్‌ఐఆర్ వివరాలు ప్రస్తావించినప్పటికీ, అసంబద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. అలాంటి వాటిని ’అనామలిస్’ ఓటర్లుగా పేర్కొంటూ వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఈవో కార్యాలయం జాబితాను సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరందరి నుఉంచి సెప్టెంబర్ 16 వరకు వివరణలు, అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 19వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.   

మీ ఓటుందా? ఇలా చెక్ చేసుకోండి  

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఓటర్లు ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు.  

* ముందుగా ఈసీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.eci.gov.in/ను సందర్శించాలి. ఆ తరువాత సర్-2026 డౌన్‌లోడ్ ఎలక్ట్రోరల్ రూల్‌పై క్లిక్ చేయాలి.

* తమ రాష్ట్రాన్ని(తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్) ఎంచుకోవాలి

* మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాష ఎంపిక చేసుకోవాలి. దిగువన ఓటరు జాబితాలు వరుస క్రమంలో కనిపిస్తాయి.

* జాబితాలో మీ పార్ట్ నంబర్/పేరును సెలక్ట్ చేసి పైన కనిపించే క్యాప్చాకోడ్‌ను ఎంటర్ చేసి డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయగానే.. మీ ఓటరు జాబితా పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. దాంట్లో మీ సీరియల్ నంబర్‌తో లేదా మీ పేరు/ఎపిక్ నంబర్‌లతో చెక్ చేసుకోవచ్చు.