పోరాటానికి ఊరట
పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేస్తూ తాజాగా కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం లద్దాఖ్ రాజకీయ, సామాజిక మార్పులకు నాంది పలికే అవకాశం కనిపిస్తున్నది. లద్దాఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చి తమ అస్తిత్వాన్ని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ అక్కడి ప్రజలు ఆరేళ్ల నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది నిరసనలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
ఆ ఉద్యమానికి వాంగ్‌చుక్ వెన్నెముకగా నిలిచారు. లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన ముఖ్యభూమిక పోషించారు. నాడు వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షలు, శాంతియుత పాదయాత్రలు ఒక సామాజిక ఉద్యమానికి దారి తీసింది. ఈ క్రమంలో గతేడాది లేహ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆయనపై జాతీయ భద్రతా చట్టం (ఉపా) ప్రయోగించి జైలుకు పంపింది.
అప్పటి నుంచి వాంగ్‌చుక్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నిర్బంధంలో ఉన్నారు. ఆయన విడుదల ఇప్పుడు లద్దాఖ్ ప్రజల్లో నూతన ఆశలు చిగురింపజేస్తున్నది. లద్దాఖ్‌ను కేంద్రప్రభుత్వం జమ్మూకశ్మీర్ నుంచి విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత, తమకు స్వయం ప్రతిపత్తి దక్కుతుందని ఆ ప్రాంత వాసులు భావించారు. కానీ, అది జరగలేదు. దీంతో అక్కడి ప్రజలు తమ భూములు, ఉద్యోగాలు, సంస్కృతిపై బయటి వ్యక్తుల ప్రభావం ఉంటుందేమోనన్న భయాందోళనలో ఉన్నారు.
పారిశ్రామికీకరణ పేరుతో ప్రభుత్వాలు హిమాలయాల పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే చర్యలను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. అక్కడి ప్రజలు కోరుకుంటున్నది.. కేవలం అధికార వికేంద్రీకరణ మాత్రమే కాదు. వారి మనుగడకు ఆధారమైన సహజ వనరుల పరిరక్షణ. తాము శాంతికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఎక్కడో ఒక చోట ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్నాయి. బంద్‌లు, నిరసనల వల్ల లద్దాఖ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ముఖ్యంగా పర్యాటక రంగం కుదేలైంది.
విద్యార్థుల చదువులు సరిగ్గా సాగడం లేదు. నిరుద్యోగుల ఆశలు నెరవరడం లేదు. సాధారణ పౌరుల ఉపాధి సైతం దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు, ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిపేందుకు వాంగ్‌చుక్ విడుదల అక్కడి ప్రజలకు ఊరటనిస్తున్నది. వాంగ్‌చుక్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన భార్య గీతాంజలి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేశారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌పై ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకున్నది.
చివరకు దిగివచ్చింది. లద్దాఖ్‌లో శాంతిస్థాపనలో భాగంగా వాంగ్‌చుక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని వర్గాలతో చర్చించేందుకూ సిద్ధమని కూడా ప్రకటించింది. ఈ పరిణామం శుభపరిణామమే అయినా, ప్రజల ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించినప్పుడే అక్కడ శాశ్వత శాంతి సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కేవలం ఒక ఉద్యమ నేతను విడుదల చేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, లద్దాఖ్ ప్రజల భౌగోళిక, సాంస్కృతిక భద్రతపై వారికి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్తున్నారు. హిమాలయాల రక్షణ అంటే.. కేవలం సరిహద్దుల రక్షణ మాత్రమే కాదని, అక్కడ నివసించే ప్రజల ఆకాంక్షలు కూడా అని గుర్తించాలని అభిప్రాయపడుతున్నారు. వాంగ్‌చుక్ విడుదల చర్చల ప్రక్రియకు నాంది కావాలని, హిమగిరి సానువుల్లో మళ్లీ శాంతిసౌఖ్యాలు వెల్లివిరియాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.




