7 June, 2026 | 3:20 PM

జిల్లా ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత

07-06-2026 01:48 PM

బాలిక మృతిపై బంధువుల ఆందోళన

గద్వాల టౌన్: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన ఇందు (17) శనివారం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం మృతి చెందడంతో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన తమ కుమార్తె వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు జిల్లా ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఆందోళనకారులు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే సంఘటన స్థలానికి రావాలని డిమాండ్ చేశారు.

అలాగే బాధిత కుటుంబానికి ఐదు ఎకరాల భూమి,కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.నిరసనల కారణంగా ఆర్వోబీ రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న గద్వాల ఆర్డీవో శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మృతురాలి కుటుంబ సభ్యుల్లో ఒకరికి నర్సింగ్ కళాశాలలో అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగావకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే అధికారుల హామీలతో సంతృప్తి చెందని కుటుంబ సభ్యులు నిరసన కొనసాగించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

ఆందోళనకారులను రోడ్డుపై నుంచి తొలగించే క్రమంలో పోలీసులకు,మృతురాలి బంధువులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మా బిడ్డ ప్రాణాలు పోయాయి.మాకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదు అంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. ఇదిలా ఉండగా పెద్ద సంఖ్యలో మహిళలు ఆందోళనలో పాల్గొన్నప్పటికీ సంఘటన స్థలంలో మహిళా పోలీసు సిబ్బంది తగినంతగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.దీంతో మహిళా నిరసనకారులను నియంత్రించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ధర్నాకు ప్రజా సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీపీఎం నాయకులు, అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు.