సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు
రోగులకు నాణ్యమైన మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
కొండపాక పిహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్ హైమావతి
గైరాజరైన సిబ్బందిపై ఆగ్రహం
కొండపాక జులై 10: కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
ఉదయం9:58 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న కలెక్టర్ కు అటెండర్ మినహా మెడికల్ ఆఫీసర్ తో పాటు కిందిస్థాయి సిబ్బంది ఎవరు విధులలో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు రోగులకు సమయానికి వైద్య సేవలు అందించడం వైద్య సిబ్బంది బాధ్యత అని స్పష్టం చేశారు.
అనంతరం సిద్దిపేట జిల్లా వైద్య అధికారి డిఎంహెచ్ ఓ కు ఫోన్ చేసి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సమయపాలన కచ్చితంగా పాటించాలని, విధులకు ఆలస్యంగా హాజరవుతున్న వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది ఒక్కరు కూడా లేకపోవడం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ కె హైమావతి పునరుద్గాటించారు.






