26 May, 2026 | 1:22 AM

రిజిస్ట్రేషనా.. రేపు రాపోండి!

26-05-2026 12:30 AM

తాడూరులో నిలిచిన రిజిస్ట్రేషన్లు 

వారం రోజులుగా కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలు..

వరుస మీటింగులే కారణం అంటూ.. కుంటి సాకులు 

నాగర్ కర్నూల్, మే25 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్లు బుక్ చేసుకుని వారం గడుస్తున్నా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు పూర్తి కాకపోవడంతో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్లాట్ బుక్ చేసుకున్న తరువాత అన్ని పత్రాలు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు అందుబాటులో లేక పోవడంతో తమ పనులు జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రయాణ ఖర్చులు పెట్టుకుని వచ్చిన తర్వాత కూడా రేపు రా పోండి అంటూ రిజిస్ట్రేషన్లు జరగకపోవడం వల్ల ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు పేర్కొన్నారు.

ఈ విషయంపై సోమవారం జాయింట్ సబ్రిజిస్ట్రార్, తహసీల్దార్ను క్రయ విక్రయదారులు నిలదీశారు. ఇతర అధికారిక సమావేశాలు ఉండటం, ఒకరోజు సెలవులంటూ కుంటి సాకులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల సమావేశాలు ఉన్న క్రమంలోనూ కిందిస్థాయి అధికారుల చేత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలని ఉన్న పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.