26 May, 2026 | 1:06 AM

తాలు, తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ!

26-05-2026 12:23 AM

ఒక్కో తూకంలో ఆరు కేజీల మేర లూటి

భారీగా నష్టపోతున్న రైతాంగం

నాగర్ కర్నూల్/కల్వకుర్తి మే 25 (విజయక్రాంతి): పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండడంతో గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశించిన ప్పటికీ, మిల్లుల వద్ద వ్యాపారులు తాలు, తరుగు అంటూ విధిస్తున్న కోతలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు.

జిల్లాలో ఈసారి వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన రైతుల వద్ద తాలు, తరుగులు, తేమ శాతం పేర్లతో క్వింటాకు నాలుగు నుంచి ఆరు కిలోల వరకు కోతలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

రవాణా ఖర్చులు, హమాలి, మిల్లర్ల కోతలు తదితర వ్యయాలు కలిపి క్వింటాకు సుమారు రూ.500 వరకు అదనపు భారం పడుతోందని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించి బస్తాల్లో నింపి మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ వ్యాపారులు వివిధ కారణాలు చూపుతూ మరింత కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రైతు పూర్తిగా తూర్పారబెట్టిన, నాణ్యత కలిగిన ధాన్యమే తీసుకురావాలని షరతులు విధిస్తున్నారని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నష్టపోతున్నాం అంటున్న వ్యాపారులు.. 

వ్యాపారులు మాత్రం మేమే నష్ట పోతున్నాం అంటూ తమ వాదనను వినిపిస్తున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని, క్వింటాల్ వడ్లకు ప్రభుత్వానికి 68 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా రైతులు తీసుకొచ్చే ధాన్యంతో 60 కిలోల బియ్యం కూడా రావడం లేదన్న వాదన వినిపిస్తున్నారు.

నాణ్యతలేని ధాన్యం కొనుగోలు చేస్తే తాము భారీగా నష్టపోతున్నామని మిల్లర్లు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు మాత్రం రైతులకు ఎలాంటి కోతలు విధించకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని సూచిస్తున్నప్పటికీ, నష్టాలను భరించడం తమ వల్ల కాదని కొందరు మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. నాణ్యత ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేస్తామని, లేదంటే తిరిగి తీసుకెళ్లాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రైతులు వ్యాపారులు విధించే కోతలను భరిస్తూ ధాన్యాన్ని అమ్ముకుంటున్న పరిస్థితి ఏర్పడింది.

అధికారులు వ్యాపారులు ఒకటి కావడంతో నామమాత్రంగా క్షేత్రస్థాయిలో పరిశీలన  చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని రైతుల ఆరోపిస్తున్నారు. సోమవారం ఊరుకొండ పేట మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి తను తెలంగాణ రాష్ట్ర విత్తన శుద్ధి కేంద్రం నుండి 1010 రకం నాణ్యమైన వరి పండించినప్పటికీ మిల్లర్లు తమ ధాన్యానికి కూడా కోతలు విధిస్తున్నారని నిరసిస్తూ ప్రజావాణి హాల్లో జిల్లా అదనపు కలెక్టర్ కి వరి ధాన్యాన్ని అప్పగించారు. 

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారు లపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సోమవారం జిల్లాలోని ఆయా మిల్లుల్లో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి మిల్లులను ఆకస్మిక తనిఖీ చేశారు. తేమ పాలు తరుగు అంటూ కుంటి సాకులు చెప్పి మిల్లు వద్దకు వచ్చిన వరి ధాన్యాన్ని మిల్లర్లు దించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి.