ఇక ప్రభుత్వ మెట్రో!
- 100 శాతం యాజమాన్య హక్కులు తెలంగాణ సర్కారుకు బదిలీ
- రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్
- 20 ఏళ్ల కాలపరిమితి.. త్రైమాసిక పద్ధతిలో రుణ సౌకర్యం
- ఐఆర్‌ఎఫ్‌సీతో ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్ ఒప్పదం
- ఎంఓయూపై సీఎస్ రామకృష్ణారావు, ఐఆర్‌ఎఫ్ సీఎండీ మనోజ్‌కుమార్ దూబే సంతకాలు
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోకు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూర్చేలా కీలక ఒప్పందం జరిగింది. నగర మెట్రో రైలుకు రూ.13,600 కోట్లు రీఫైనాన్సింగ్ చేసేందుకు ఐఆర్‌ఎఫ్‌సీతో ఎల్‌అండ్‌టీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ మనోజుకుమార్ దూబే, సీఎస్ రామకృష్ణారావు సమక్షంలో ఢిల్లీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.
20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ మెట్రో రైలు 100 శాతం యాజమా న్యం వాటా తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ అయినట్లు వెల్లడించారు. భాగ్యనగరంలో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నా రు. దేశ ఆర్థిక ప్రగతిలో హైదరాబాద్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు.
రాజధాని నగరంలోని అనేక ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ పెరిగితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణికులు సులభంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని వెల్లడించారు. మెట్రోకు సంబంధించిన రుణాలను రీఫైనాన్స్ చేసినందుకు సహకరించిన భారత ప్రభుత్వానికి, ఎల్‌అండ్‌టీ సంస్థకు, ఐఆర్‌ఎఫ్‌సీ, హెచ్‌ఎంఆర్‌ఎల్ బృందాలకు సీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాజధాని నగరంలో సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రజారవాణా వ్యవస్థను విస్తరించడమే ప్రభు త్వ లక్ష్యమని వెల్లడించారు.
మెట్రో ఆర్థికభారం తగ్గించేందుకు రీఫైనాన్సింగ్ ఎంతగానో దోహదపడనుంది. మెట్రో భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని, నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచ డానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి హైదరాబాద్ కీలక ఇంజిన్‌గా ఎదుగుతోంది సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు. మొదటి దశ ప్రభుత్వపరం కావడంతో ఇక రెండో దశ పనులు మరింత వేగంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మెట్రోను ప్రభు త్వం స్వాధీనం చేసుకోవడం, రీ ఫైనాన్సింగ్, రెండో దశ అభివృద్ధి పనుల పురోగతికి ఇది ఎంతగానో దోహదపడనుంది.
రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్ 2-ఏ ..
మెట్రో మొదటి దశ 3 కారిడార్లను (69 కి.మీ) కవర్ చేస్తూ రూ.22,000 కోట్లతో అమలు చేశారు. ఫేజ్ 2-ఏ లో భాగంగా మొ త్తం 76.4 కి.మీల నూతన మార్గాన్ని నిర్మించనున్నారు. దీనిని రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 5 కారిడార్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* కారిడార్ 4: నాగోల్ నుంచి శంషాబాద్ ఆర్‌జీఐఏ (ఎయిర్‌పోర్ట్ కారిడార్) వరకు 36.8 కి.మీ నిర్మించనున్నారు.
* కారిడార్ 5: రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు 11.6 కి.మీ మేర మెట్రోను విస్తరించనున్నారు.
* కారిడార్ 6: ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట (పాత నగర కారిడార్) వరకు 7.5 కి.మీ నిర్మించనున్నారు.
* కారిడార్ 7: మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కి.మీ నూతన మార్గం వేయనున్నారు.
* కారిడార్ 8: ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కి.మీ కొత్త మార్గం నిర్మించనున్నారు.
మూడు కారిడార్లతో ఫేజ్ 2-బీ ..
ఫేజ్ 2-బీ మొత్తం 86.1 కి.మీ. పొడవు గల మూడు కారిడార్లును నిర్మించనున్నారు. దీనికోసం రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో అందుబాటులోకి ఈ నూతన మార్గాన్ని అం దుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు.
* కారిడార్ 9: ఆర్‌జీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ)కి 39.6 కి.మీ కొత్త మార్గం అందుబాటులోకి రానుంది.
* కారిడార్ 10: జేబీఎస్ న్యూ నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ నూతన మార్గాన్ని నిర్మించనున్నారు.
* కారిడార్ 11: జేబీఎస్ న్యూ నుంచి షామీర్‌పేట్ వరకు 22.0 కి.మీ కొత్త మార్గం నిర్మించనున్నారు.






