పంచాయతీ నిధులు స్వాహా!
- జీపీలలో నిధుల పేరిట అడ్డగోలు వ్యవహారం
- వ్యక్తిగత ఖాతాల్లోకి నిధుల మళ్లింపు
- అరకొరగా పారిశుద్ధ్య నిర్వహణ
- కానరాని అభివృద్ధి పనులు
- పూర్తిస్థాయిలో వినియోగించని స్వర్ణ పంచాయతీ యాప్
మెదక్, ఏప్రిల్ 26(విజయక్రాంతి): జిల్లాలోని పలు పంచాయతీల్లో నిధులు పక్కదారి పడుతున్నాయి. పంచాయతీల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ‘ఈ గ్రామ్ స్వరాజ్ యాప్’ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు, ప్రజలు చెల్లించే పన్నులతో పాటు ప్రతి పైసాకు జమా ఖర్చులు పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసింది. కానీ కొన్ని పంచాయతీల్లో ఈ యాప్లోను తప్పుడు బిల్లులు అప్లోడ్ చేస్తూ.. నిధులు కాజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అడ్డగోలుగా హాంఫట్..?
గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు తమకు వచ్చేవి ఉన్నాయని పలువురు కార్యదర్శులు నిబంధనలను ఉల్లంఘించి మరీ వాటిని హాంఫట్ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పంచాయతీలకు వచ్చిన బిల్లులను అడ్డగోలుగా హాంఫట్ చేస్తున్నారు. సాధారణంగా బిల్లులను ఏజెన్సీ లేదా ఫోరమ్ పేరు పైన ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వ్యక్తి గత ఖాతాల్లోకి వీటిని మళ్లించుకోవడం ద్వారా ఇప్పటికే మెదక్ జిల్లాలో లక్షల రూపాయల అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలున్నాయి.
ఇటీవల కొల్చారం మండలంలో వరిగుంతం, రంగంపేట, సంగాయిపేట, పోతిరెడ్డిపల్లి, కొంగోడు గ్రామ పంచాయతీ నిధులు కంప్యూటర్ ఆపరేటర్ ఖాతాలోకి తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే సీతారాం తండా జీపీలో నిధులను కార్యదర్శి భర్త ఖాతాలోకి బదిలీ చేసిన కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా జిల్లాలో చాలా మండలాల్లో కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్ల ఖాతాల్లోకి నిధులు తరలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఐదు విడతల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు...
గతంలో పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు కొత్త పాలక వర్గాలు కొలువుదీరిన తర్వాత విడుదల అయ్యాయి. ఇప్పటి వరకు ఐదు విడతలుగా సుమారు రూ.40 కోట్లు విడుదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు అయ్యాయి. ఇవి సంవత్సరంలో రెండు సార్లు విడుదల అవుతాయి. గతంలో సర్పంచు లు లేకపోవడంతో ఈ నిధులు పెండింగ్ లో పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది.
అప్పట్లో పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించి పనులు చేయించారు. అయితే ఆ సమయంలో కేంద్రం నుంచి నిధులు నిలిచిపోవడం, రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేక ఫండ్స్ రాకపోవడంతో పల్లెల్లో పారిశుధ్య పనులు, తాగునీరు, ట్రాక్టర్ల నిర్వహణ, కరెంట్ బిల్లుల కోసం కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించామని చెబుతున్నారు. ఇప్పుడు కొత్త పాలక వర్గాలు ఏర్పడడంతో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రావడంతో కార్యదర్శులకు రావాల్సిన అసలు కంటే ఎక్కువ అక్రమంగా లక్షలు స్వాహా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి బిల్లులు లేకుండానే వ్యక్తిగతంగా ఖాతాల్లోకి మళ్ళించూకోవడం ద్వారా యధేచ్చగా స్వాహా చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.






