కార్మికులకు మరింత భరోసా
కొత్త లేబర్ కోడ్‌లతో అదనపు ప్రయోజనాలు
త్వరలో రామగుండం ఈఎస్‌ఐ ఆస్పత్రి, నాచారం నర్సింగ్ కళాశాల ప్రారంభం
కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ
ఏడు ఈఎస్‌ఐ హెల్త్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లు కార్మికుల జీవితాలకు మరింత భరోసా ఇవ్వనున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కార్మికులకు అదనపు భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.
రామగుండంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి, నాచారంలో ఈఎస్‌ఐ నర్సింగ్ కళాశాలను ఏడాదిలోపు ప్రారంభించి, సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం, వైద్య సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా రూ.688 కోట్ల విలువైన ఏడు ఈఎస్‌ఐ హెల్త్ ప్రాజెక్టులను హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ ఆస్పత్రి నుంచి మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
ఇందులో సనత్‌నగర్ ఈఎస్‌ఐ నూతన ఓపీడీ బ్లాక్, అసోం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఏడు ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ సుమారు రూ.668 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏడు ఈఎస్‌ఐ హెల్త్ ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ఆధునిక వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. సనత్‌నగర్‌లో రూ.211.13 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓపీడీ బ్లాక్ ద్వారా రాష్ట్రంలోని 12.30 లక్షల మంది కార్మికులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణే నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త లేబర్‌కోడ్‌లు కార్మికుల జీవితాల్లో మరింత భోరోసాను ఇస్తాయన్నారు. మెరుగైన కార్మిక, ఉద్యోగ విధానాలు అమల్లోకి వస్తాయన్నారు. పాత చట్టాల కారణంగా మహిళలు, పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఉండేది కాదన్నారు.
15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు అనుమతుల్విండి: మంత్రి వివేక్
శంషాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించిన ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని, మహబూబ్‌నగర్‌లో కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రికి అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో వరంగల్ ప్రాంతంలో కూడా ఈఎస్‌ఐ ఆస్పత్రి అవసరం ఉంటుందని తెలిపారు. భూ సమస్యల కారణంగా నిలిచిపోయిన 15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు మళ్లీ అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే 12 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రామగుండం అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమని, అక్కడ పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి అత్యవసరమని పేర్కొన్నారు. గతంలో ఆమోదం లభించినప్పటికీ టెండర్ల ప్రక్రియ నిలిచిపోయిందని, వెంటనే పునరుద్ధరించాలన్నారు.
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఆస్పత్రి నిర్మాణాన్ని వేగవంతం చేసి వచ్చే ఏడాది నుంచే సేవలు అందుబాటులోకి తెచ్చే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తన తండ్రి, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కాకా వెంకటస్వామి హయాంలో కూడా సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిని సందర్శించానని, ఇప్పుడు రాష్ట్ర కార్మిక మంత్రిగా సందర్శించడం ఆనందంగా ఉన్నదని ఈ సందర్భంగా దన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వచ్చిన మార్పులు ఎంతో ఆకట్టుకున్నాయని మంత్రి వెంకటస్వామి పేర్కొన్నారు.






