పుడమి తల్లి నుదుట ఆకుపచ్చ సింధూరం...
ఎదుగుతున్న పంటలతో చిగురిస్తున్న ఆశలు.
బోథ్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) బోథ్ నియోజక వర్గంలో ఆశించిన స్థాయిలో పంటలకు అనుకూలంగా వర్షాలు కురవడంతో రైతుల్లో పంటలపై ఆశలు చిగురిస్తున్నాయి. విత్తనాలు నాటి వరుణుడి కరుణ కోసం ఎదురుచూసిన రైతన్నకు అడప దడపా కురిసిన వర్షాలు మొక్కల ఎదుగుదలకు తోడ్పాటు అందించినట్లు అయింది.
పెరగని భూగర్భ జలం
అడప దడప కురుస్తున్న వర్షాల వల్ల పంటలకు ఉపయోగపడుతున్న ఈ వర్షాలతో భూగర్భ జలాలు మాత్రం పెరగడం లేదు. రెండు రోజుల కిందట కురిసిన వర్షం సోనాల మండలంలో 18 మిల్లీ మీటర్లు కాగా బోత్ మండలంలో 13.8 మిల్లీ మీటర్లుగా నమోదయింది. దీంతో పంటలు పచ్చదనంతో నిండికున్నాయి. సోనాల, బోత్ మండలాలలో 44 వేల ఎకరాలలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. సోయాబీన్ పదివేల ఎకరాలలో 20 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటల సాగు ఆశాజనకంగా ఉన్నా ముందు ముందు ఎలా ఉంటుందోనని రైతులు మదన పడుతున్నారు.
ఎల్ ని నో పై విస్తృత ప్రచారం
నాటిన విత్తనం మొలకెత్తడం వల్ల పంటను కాపాడుకోవడం పైన వ్యవసాయ శాఖ అధికారులతోపాటు అన్ని గ్రామాలలో కార్యదర్శిలు, ఎంపీడీవోలు సమావేశాలను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడంపై రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. ఒకవైపు కరువు ఛాయలు వెంటాడుతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నా రైతులు మాత్రం ధైర్యంగా వరుణుడిపై భారం వేసి పంటలను సాగు చేస్తున్నారు.






