నిండు జీవితానికి రెండు చుక్కలు
- జిల్లాలో 76,397 మంది చిన్నారులు
- విధుల్లో 1836 మంది మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది
- రేపటి పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి - డీ ఎం అండ్ హెచ్ ఓ
మంచిర్యాల, (విజయక్రాంతి) : జిల్లాలో పోలియో మమహ్మారిని నిర్మూలించేందుకు ఈ నెల 28న జిల్లా వైద్యాధికారులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలలోపు 76,397 మంది పిల్లలు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు 46 రూట్లలో 459 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. 24 మొబైల్ టీమ్స్ ద్వారా పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాణం చేసే ప్రయాణికుల పిల్లలకు సమయానికి పోలియో చుక్కలు వేసేందుకు 24 ట్రాన్సిట్ పాయింట్లను (రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, ప్రత్యేక ప్రధాన చౌరస్తాలో, అంగన్ వాడీ కేంద్రాల్లో పోలింగ్ బూతులను) ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం 1836 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
మూడు రోజుల ప్రణాళిక...
పోలియో వ్యాధి సోకిన ప్రతి ఒక శిశువు ద్వారా, ఆ వ్యాధికారక వైరస్ వల్ల మరో 200 మందికి సోకే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 28, 29, 30 తేదీల్లో జిల్లాలో ఉన్న ఐదేండ్లలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి రోజు 28న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏర్పాటు చేసిన బూత్ లలో పోలియో చుక్కలు వేస్తారు. 29న సిబ్బంది ఇంటింటికి తిరిగి, 30న ఈ రెండు రోజుల్లో మిస్సయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. బూత్ లతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ హోంలు, అంగన్వాడీ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్లేస్కూళ్లు, గార్డెన్లు, పార్కులు, ఫంక్షన్ హాళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చీలు, సమావేశ హాళ్లు, ప్రధాన కూడళ్ల వద్ద చుక్కలు వేయించుకోవచ్చు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో ట్రాన్సిట్ టీంలు పోలియో చుక్కలు వేయనున్నారు. వంద శాతం పల్స్ పోలియోను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
76,397 మంది చిన్నారుల కోసం 459 కేంద్రాలు...
జిల్లా ప్రధానాసుపత్రితో పాటు 19 పీహెచ్సీలు, ఐదు యూపీహెచ్సీలు, ఉప కేంద్రాలు 169 (121 రూరల్, 48 అర్బన్) అన్నింటిలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా మొత్తంలో 7,99,769 జనాభా ఉండగా ఇందులో 0 - 5 సంవత్సరాలలోపు 76,397 మంది పిల్లలకు 4,773 వాయిల్స్ (20 మందికి ఒక వాయిల్) ఉందుబాటులో ఉంచారు. ఇందు కోసం 459 (ఐదు అర్బన్ ఏరియాల్లో 86 కేంద్రాలు, రూరల్ ఏరియాలో 353, ట్రైబల్ ఏరియాలో 20) కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కు నలుగురి (ఏఎన్ఎం, ఆశా, అంగన్ వాడీలు, హెల్పర్) చొప్పున మొత్తం 1836 మంది సిబ్బందితోపాటు మెడికల్ ఆఫీసర్ లు, సూపర్ వైజర్లు, ఫార్మాసిస్టులు విధులు నిర్వహించనున్నారు. మానిటరింగ్ అధికారులు, మెడికల్ అధికారులు పర్యవేక్షించనున్నారు.
సమయపాలన పాటించి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి - డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్
జిల్లాలోని వైద్యులు, వైద్య సిబ్బంది ఆయా పల్స్ పోలియో కేంద్రాలలో సమయపాలన పాటిస్తూ మూడు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. శుక్ర వారం డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లు, కరపత్రికలను విడుదల చేశారు. ఐదు సంవత్సరంలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని, అందరికి అందుబాటులో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునిల్, డెమో బుక్క వెంకటేశ్వర్, రషీద్, సిహెచ్ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, నాందేవ్, పుట్ట సత్తయ్య, శ్రీనివాస్, డీపీహెచ్ఎన్ ఆర్ఎస్ పద్మ, జిల్లా ఫార్మసిస్ట్ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మొత్తం జనాభా : 8,22,671
గుర్తించిన ఇండ్లు : 2,00,392
చుక్కలు వేయించే (ఐదేండ్లలోపు) పిల్లలు : 76,397
చుక్కలు వేసేందుకు ఏర్పాటు చేసిన బూత్ లు : 459
ఏర్పాటు చేసిన రూట్లు : 46 (అర్బన్, రూరల్ 37, ట్రైబల్ 9)
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో : 32 కేంద్రాలు
కేటాయించిన మొత్తం సిబ్బంది : 1836
మొబైల్ టీంలు : 24






