25 June, 2026 | 2:30 AM

డీపీఆర్ సిద్ధం కాకముందే ఎయిర్ పోర్ట్‌కు శంకుస్థాపనలంటూ ప్రచారం

25-06-2026 12:00 AM

ప్రజలను మోసం చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి రామన్న మండిపాటు

ఆదిలాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్, సీసీఐ పరిశ్రమ అంశాలపై స్థానిక బీజేపీ ఎంపీ గోడం నగేష్. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజలకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు.

బుధవారం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ... కేవలం కమిషన్ ల కోసమే ఈ ప్రాజెక్టుల పేరుతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తి కాకముందే శంకుస్థాపనలు అంటూ ఎమ్మెల్యే రాజకీయ పబ్బం కడుపుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి తాము ఎప్పుడూ స్వాగతం పలుకుతామని, అయితే బూటకపు హామీలతో ప్రజలను మోసం చేయడాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, ప్రస్తుతం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం జిల్లా ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ను ఏరోస్పేస్ జోన్గా గుర్తించి, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రూ.8 కోట్లతో సర్వేలు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. అలాగే రేణుక సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు రూ.4 కోట్లతో సర్వేలు నిర్వహించగా వాటిని అడ్డుకున్నది ప్రస్తుత నాయకులేనని ఆరోపించారు.