18 March, 2026 | 12:58 AM

మెడికల్ బోర్డు సమస్యలను వెంటనే పరిష్కరించాలి

17-03-2026 07:51 PM

కార్మికుల ఆదాయపు పన్నును యాజమాన్యమే రీయింబర్స్ చేయాలి

హక్కుల సాధన కోసం ఏప్రిల్ సమ్మెను విజయవంతం చేయండి

ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న మెడికల్ బోర్డు, సొంత ఇల్లు, ఐటీ రీయింబర్స్‌మెంట్ వంటి కీలక సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏప్రిల్ నెలలో సమ్మెకు వెళ్తామని ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి హెచ్చరించారు. వీకే వర్క్‌షాప్‌లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన అనంతరం పిట్ కార్యదర్శి మధు కృష్ణ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికులు రక్తాన్ని ధారపోసి సంస్థను లాభాల్లోకి తెస్తుంటే, యాజమాన్యం వారి సంక్షేమాన్ని విస్మరించడం తగదన్నారు.

జూలై 2025 నుండి పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డులను వెంటనే సమీక్షించి, వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారుల తరహాలోనే కార్మికుల పర్క్స్ (Perks) పై పడే ఆదాయపు పన్నును సంస్థే రీయింబర్స్ చేయాలని, సొంత ఇంటి పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. పేరు మార్పులు, క్యాడర్ స్కీమ్ సవరణల వంటి సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తాం.

ఇందులో భాగంగా ఈనెల 17 నుండి 31 వరకు గోలేటి నుండి సత్తుపల్లి వరకు 'బస్ జాత' నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ ఆఫీస్ బేరర్లు సందేబోయిన శ్రీనివాస్, గుమ్మడి వీరయ్య, పిట్ కార్యదర్శి మధు కృష్ణ, కమిటీ సభ్యులు గుమ్మడి మురళి, రాజ కుమారస్వామి, కరుణాకర్, అశోక్, కిరణ్ కుమార్, దుర్గాప్రసాద్, కల్యాణ్, పీఆర్సీ రెడ్డి, సలిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.