24 March, 2026 | 10:48 PM

డంపింగ్ యార్డ్‌తో ఇబ్బందులు

24-03-2026 12:00 AM

తక్షణ తొలగింపునకు కాలనీ వాసుల డిమాండ్

జగిత్యాల, మార్చి 23 ( విజయక్రాంతి ) :జగిత్యాల ఇందిరమ్మ డబుల్ బెడ్రూం అర్బన్ కాలనీ (నూకపల్లి) నివాసితులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు.కాలనీ సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ భారీగా చెత్తను పడేయడం, తరచుగా దానిని కాల్చడం వల్ల విషపూరిత పొగ, దుర్వాసన కాలనీ అంతటా వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు.

దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారని తెలిపారు. కొందరు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు.ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో, ఈ పరిస్థితుల్లో కాలనీలో నివసించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ను తక్షణమే తొలగించకపోతే తాము అక్కడ ఉండలేమని, లేకపోతే తమను సురక్షిత ప్రాం తానికి తరలించాలని డిమాండ్ చేశారు.లేకపోతే ఆందోళనలు, నిరసనలు, చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు వెనుకాడబోమని కాలనీ వాసులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బొల్లారం స్వామి, ఎండి ఖలీల్, భోగ నాగ భూషణం, కొమాకుల రమేష్, కంటే విజయ, ఇబ్రహీం, శివాజీ, వేణు గోపాల్, సురేష్ శ్రీనివాస్, సబిహ,లక్ష్మి కాలనీ వాసులు పాల్గొన్నారు.