ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శిబిరం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ వో కే.లలిత దేవి.
మొయినాబాద్ మార్చి 23(విజయక్రాంతి): ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యచరణలో భాగంగా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరానికి ముఖ్యఅతిథిలుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ వో కే.లలితలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా జబ్బులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్యం తగిన సలహాలు అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆరోగ్య పథకాల గురించి అవగాహన కల్పించడం గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధుల ఆరోగ్య వివరాలు పరిశీలించి. తగిన వైద్యం అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఉచిత శిబిరాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య సూచించారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో 233 మంది మహిళలు, 135 మంది పురుషులు పాల్గొనగా మొత్తం 368 మందికి ఎముకలు, దంత, కంటి, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు, చిన్నపిల్లలకు సంపూర్ణ టీకాలు, రక్తపోటు, షుగర్ సాధారణ వ్యాధులకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్, డాక్టర్ పూనం, డిప్యూటీ డాక్టర్ శ్రీనివాస్, చేవెళ్ల డివిజన్ డాక్టర్ అన్నపూర్ణ, ఎంఎల్ హెచ్పీఎస్ డాక్టర్లు, మొయినాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ దుబ్బ సోనియా దర్శన్, వైస్ చైర్మన్ గరుగు రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆసుపత్రి సిబ్బంది, మరియు ప్రజా ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.




