ప్రమోషన్లలో సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి
క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీఎస్ ప్రవీణ్ కుమార్
ముషీరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాల్ ప్రమోషన్ల సందర్భంగా అర్హత, సీనియారిటీ నిబంధనలు పాటించాలని క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాబోయే డీపీసీలో ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారో, అన్ని శాంక్షన్డ్ ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేస్తారా, ఖాళీల జాబితాను ఎప్పుడు ప్రకటిస్తారో స్పష్టం చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ టి. ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. బాలయ్య లు డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 1998 బ్యాచ్కు చెందిన అర్హత కలిగిన జూనియర్ లెక్చరర్లను సీనియారిటీ నిబంధనల ప్రకారం ప్రమోట్ చేయాలని, తదుపరి బ్యాచ్లకు చెందిన వారికి అడ్డదారిలో ప్రాధాన్యం ఇవ్వకూడదని పేర్కొంది. యూజీసీ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, అర్హులైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ల విషయంలో అక్రమ లావాదేవీలు, సంఘాల ఒత్తిళ్లు ఉన్నాయన్న సమాచారంపై అధికారులు దృష్టి సారించి అవసరమైతే ఏసీబీ కి సమాచారం అందించాలని కోరారు. తప్పుడు విధానాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






