5 August, 2026 | 2:36 AM

నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం

05-08-2026 01:19 AM

అదనపు కలెక్టర్ చంద్రయ్య

లక్షెట్టిపేట, ఆగస్టు 4 : ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి చంద్రయ్య అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను పరిశీలించారు. నీట మునిగిన ముల్కలగూడ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పాఠశాల ప్రాంగణంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని పరిశీలించి, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమీప ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తాత్కాలికంగా తరలించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన అన్ని సౌకర్యాలను వెంటనే అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి తరగతి గదులు, గ్రంథాలయం, త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు.

ప్రభుత్వ విద్యాసంస్థలలో మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొనేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, ఎంఈఓ శైలజ, మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్, ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తదితరులున్నారు.