26 May, 2026 | 3:41 AM

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

26-05-2026 01:58 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, మే 25 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.

సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు.

పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు.

స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబందించి 54 దరఖాస్తులు, డిఆర్డిఏ 7, డీపీఓ 5, ల్యాండ్ రికారడ్స్ 4, డిడబ్ల్యుఓ 3, వివిధ శాఖలకు సంబంధించి 19 దరఖాస్తులు రాగా మొత్తం 92 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్డిఓ సన్యాసయ్య, హౌసింగ్ పీడీ సిద్ధార్థ్, డిఎంహెచ్‌ఓ వెంకటరమణ, డిఏఓ శ్రీధర్ రెడ్డి  జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.