26 May, 2026 | 3:04 AM

ఐదు రోజుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్స్!

26-05-2026 02:07 AM
  1. పార్టీ పదవుల భర్తీపై కాంగ్రెస్ దృష్టి ముగ్గురు లేదా నలుగురికి అవకాశం 
  2. సామాజిక న్యాయం పాటించాలనే డిమాండ్
  3. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీలకు చోటివ్వాలని నిర్ణయం 
  4. రేస్‌లో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎంపీ బలరామ్‌నాయక్, బెల్లయ్య నాయక్, ఫిరోజ్ ఖాన్, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): ప్రభుత్వంలో ఇటీవలనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా, ఇప్పుడు పార్టీ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని పార్టీ పదవులను భర్తీ చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం, ఇక పార్టీలో కీలకమైన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ పోస్టుల కోసం చాలామంది సీనియర్లు పోటీ పడుతున్నారు. పార్టీ అధిష్ఠానం మాత్రం ముగ్గురు లేదా నలుగురితో ఈ నెలఖార్‌లో నియమించే అవకాశం ఉందని సమాచారం.

ఎస్సీ, ఎస్టీతో పాటు ఓసీ, మైనార్టీ వర్గాల నుంచి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తుంది. అప్పటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియమించిన వర్కింగ్ ప్రెసిడెంట్స్‌తోనే నెట్టుకొస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్‌కుమార్‌గౌడ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కొత్త వారిని వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నియమించాలని భావించినా ముందుకు సాగలేదు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా జగ్గారెడ్డి, మంత్రి అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌గౌడ్ నియామకమై రెండేళ్లు పూర్తి కావస్తున్నా.. పార్టీ అధిష్ఠానం వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను నియమించలేని పరిస్థితిలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిల్లో ఇంకా జాప్యం చేయవద్దనే నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్లుగా గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరామ్ నాయక్ లేదా ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్‌లో ఒకరికి అవకాశం దక్కనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక  ఓసీ సామాజిక వర్గంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ముగ్గురిలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

నాలుగో వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నియమిస్తే మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఫీరోజ్ ఖాన్ లేదా మరొకరి పేరు పరిశీలన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో వర్కింగ్ పోస్టుల్లో ఉన్న కొందరు నాయకులు.. పీసీసీ అధ్యక్షులుగా ప్రమోషన్ రావడంతో.. ఇప్పుడు అరడజన్‌కు పైగా వర్కింగ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఉండగా, వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమోషన్ వచ్చింది. భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీగా ఉన్న సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీ కోసం అరడజన్‌కు పైగా నాయకులు పోటీపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్‌కుమార్‌గౌడ్ ఉండగా, వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా మిగతా సామాజిక వర్గాలకు ఇవ్వాలని బలంగా వినిపిస్తోంది.