యోగా, ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత పెంపొందుతుంది
ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు.
చిట్యాల, ఆగస్టు 2 : ప్రతిరోజూ సుదర్శన క్రియ, యోగ, ధ్యానం చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, ఆత్మస్థైర్యం పెంపొందుతాయని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, టీచర్ పల్లపు బుద్ధుడు అన్నారు. ఆదివారం ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని బీసీ హాస్టల్లో హ్యాపీనెస్ కోర్స్ ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనా విధానం పెంచేలా ప్రత్యేకంగా యోగ, ధ్యానం, పద్మ సాధనలు, త్రీ స్టేజ్ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, భస్త్రిక తదితర సాధనలు చేయిస్తున్నట్లు తెలిపారు. ధ్యానం మానవ జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అని, ప్రతి విద్యార్థి తమ నిత్యజీవితంలో సుదర్శన క్రియ, యోగ, ధ్యానాన్ని భాగం చేసుకోవాలని సూచించారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ యోగా టీచర్ పల్లపు బుద్ధుడు ను మరియు హాస్టల్ వార్డెన్ ప్రసాద్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ గౌడ్, వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, గంగాపురం రాము, మేడ బోయిన స్వాతి శ్రీను, రూపని సాయి, మర్రి పూలమ్మ మరియు నాయకులు గుత్త రవీందర్ రెడ్డి, అనంతుల శంకరయ్య, హాస్టల్ విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.






