చినుకు పడితే రంగు మారుతోంది..!
గుమ్మడిదల పారిశ్రామికవాడలో ఏరులై పారుతున్న కాలుష్యం
గుమ్మడిదల, ఆగస్టు 2: గుమ్మడిదల పారిశ్రామిక ప్రాంతంలో వర్షం చినుకు కురిస్తే చాలు పరిశ్రమల నుంచి కాలుష్యం ఏరులై పారుతూ వాగులో నుండి నీరు రంగు మారుతుంది. వర్షపు నీటిని ఆసరాగా చేసుకుని కొన్ని పరిశ్రమలు తమ ప్రాంగణాల్లో నిలువ చేసిన రసాయన వ్యర్థాలను, వాయు కాలుష్యాన్ని బయటకు వదులుతున్నారు.
దీంతో వ్యవసాయ భూములు, చెరువులు, కాలువలు కాలుష్యానికి గురవుతున్నాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలో పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో రంగు మారిన నీరు ప్రవహించడం, దుర్వాసన వెదజల్లడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నీరు వర్షపు ప్రవాహంతో పాటు సమీపంలోని వాగుల్లో, కాలువల్లో, చెరువుల్లోకి చేరి నీటి నాణ్యతపై ప్రభావం చూపుతుంది. కొన్ని పరిశ్రమల నుంచి వెలువడే వాయువులు కూడా వర్షాకాలంలో మరింత ప్రభావం చూపుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
వర్షం తర్వాత గాలిలో దుర్వాసన వ్యాపించడం పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అసౌకర్యానికి గురవటం.. దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యంతో పాటు పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్ధాలు వ్యవసాయ భూమిలోకి చేరడం వలన భూసారం దెబ్బతిని పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కలుషిత నీటితో పశువులు, పక్షులు, జలచరాలపై ప్రభావం పడుతుందని ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని తమ గోడును తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ కాలుష్యం నియంత్రణ మండలి,సంబంధిత పరిశ్రమల శాఖ అధికారులు వర్షాకాలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు రైతులు కోరుతున్నారు. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధితోపాటు ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు.






