ఆవిష్కరణ అనేది భారతదేశ డీఎన్ లోనే ఉంది
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని నైస్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడతూ... ఆవిష్కరణ, సమ్మిళితత్వం ఒకదానికొకటి విరుద్ధం కాదని, భారతదేశం కేవలం సాంకేతికతను వినియోగించుకునే స్థాయి నుండి పరిష్కారాలను అందించే స్థాయికి ఎదుగుతోందని పేర్కొన్నారు. ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని పరిష్కారాల కేంద్రంగా, ప్రపంచ ఆవిష్కరణల రంగంలో వర్ధమాన శక్తిగా అభివర్ణించారు.
ఆవిష్కరణ, సమ్మిళితత్వం శత్రువులు కావు, అవి ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి. ఆవిష్కరణ దాని విలువ వల్ల కాకుండా, దాని మానవ ప్రభావం వల్ల గొప్పదవుతుందని ఆయన చెప్పారు. సంకుచిత వాణిజ్య ప్రయోజనాల కంటే మానవాళికి ఉపయోగపడే పరిష్కారాల దిశగా కృషి చేస్తున్న భారతీయ యువతను ఆయన ప్రశంసించారు. భారతీయ యువతలో ఒక కొత్త దృక్పథం ఉందని వారు సమస్త మానవాళి గురించి ఆలోచిస్తారన్నారు.
సుస్థిరతను కేంద్రంగా చేసుకుని భారతదేశం ప్రపంచం కోసం ఆవిష్కరణలు చేస్తుందని ప్రధాని మోదీ పదేపదే వ్యాఖ్యానించారు. భారతదేశం వేగంతో, విస్తృత స్థాయిలో ఆవిష్కరణలు చేస్తుందని, సుస్థిర భవిష్యత్తు కోసం ప్రపంచం కోసం భారతదేశం ఆవిష్కరణలు చేస్తుందని కొనియాడారు. భారతదేశ ఆవిష్కరణల వారసత్వాన్ని ప్రస్తావిస్తూ, ఆవిష్కరణ అనేది భారతదేశ డీఎన్ లోనే ఉందని మోదీ పేర్కొన్నారు. "వైద్యం, యోగా, గణితం, విజ్ఞాన శాస్త్ర రంగాలలో తన కృషి ద్వారా వేల సంవత్సరాలుగా భారతదేశం మానవాళి పురోగతిని తీర్చిదిద్దిందని మోదీ వెల్లడించారు.






