26 August, 2026 | 3:44 AM

పెళ్లి శుభలేఖపై యాజమాని ఫోటో

26-08-2026 12:13 AM

పెండ్లి శుభలేఖపై జమలాపురం సర్పంచ్ దంపతుల ఫోటో

కృతజ్ఞతకు అరుదైన నిదర్శనమిచ్చిన యువకుడు

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామానికి చెందిన ధరావత్ మణికంఠ తన పెండ్లి శుభలేఖలపై యజమానుల ఫోటో ముద్రించి యజమాని పట్ల తనకున్న కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తనకు ఉద్యోగమిచ్చి జీవనోపాధి కల్పించిన చేతిని మర్చిపోకుండా జీవితాంతం గుర్తుంచుకునేలా ఓ యువకుడు పెళ్లి పత్రిక పై తన యజమానుల ఫోటోని ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సాధారణంగా పెళ్లి శుభలేఖలపై వధూవరుల ఫోటోలు, దేవతామూర్తులు చిత్రాలు, కుటుంబ సభ్యుల పేర్లు కనిపిస్తుంటాయి.

కానీ ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామానికి చెందిన ధరావత్ మణికంఠ తన కుటుంబానికి ఉపాధి కల్పించిన తన యజమానులైన ఖమ్మం నగరానికి చెందిన కేఎన్ఆర్ గ్రానైట్స్ అధినేత తుళ్లూరు కోటేశ్వరరావు, జమలాపురం గ్రామ సర్పంచ్ నిర్మలా కుమారి దంపతుల ఫోటోలను వేసి తన కృతజ్ఞతకు అరుదైన నిదర్శనాన్ని చాటాడు. గత 6 ఏళ్ళ క్రితం మణికంఠకు తన యజమానులు ఖమ్మంలో గల గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కల్పించారు.

ఆ సహాయాన్ని గుర్తుంచుకొని మణికంఠ తనకు ఉపాధి కల్పించిన యజమానిని కేవలం బాస్ గా చూడకుండా తన కుటుంబాన్ని నిలబెట్టుకునేందుకు అవకాశం ఇచ్చిన వ్యక్తులుగా భావించాడు. అందుకే తన పెళ్లి వేడుకకు సంబంధించిన శుభలేఖ పై యజమానుల చిత్రాన్ని ముద్రించి ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నాడు.జీవితంలో ఎదగడానికి ప్రతి ఒక్కరికి ఎదో ఒక సమయంలో ఎవరో ఒకరి సహాయం అవసరం ఉంటుంది.కొందరికి చదువు, మరికొందరికి ఆర్థికసాయం, ఇంకొందరికి ఉద్యోగం రూపంలో తోడ్పాటు లభిస్తుంటుంది.

అయితే అత్యంత ముఖ్యమైన సందర్భంలో తిరిగి సహాయం చేసే వ్యక్తులను గౌరవించడం అందరిలో కనిపించదు. కానీ మణికంఠ తనకు ఉపాధినిచ్చిన తన యజమానులు జీవితంలో ముఖ్యమైన రోజున గుర్తుచేసుకోవడం బాధ్యతగా తీసుకున్నాడు. అభిమానం అంటే ఇదే, కృతజ్ఞత దానికన్నా గొప్పదని చాటాడు.కాగా మణికంఠ వివాహం ఈనెల 26న జమలాపురం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జరగబోతోంది. నాకు పని కల్పించిన వ్యక్తులే నా జీవితంలో ఎంతో ముఖ్యమని ఈ యువకుడు చూపించిన గౌరవం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి ఇది అందరు చేయగలిగే పని అయినా దానిలో దాగి ఉన్న అభిమానం,కృతజ్ఞత మాత్రం చాలా పెద్దదిగా కనిపిస్తోంది.