కొండాపూర్ పీహెచ్‌సీలో అలా వస్తారు.. ఇలా వెళ్తారు
స్టాఫ్‌నర్స్ ఇష్టారాజ్యం
కొండాపూర్, ఆగస్టు 25: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అందుకు విరుద్ధంగా సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. మండల కేంద్రమైన కొండాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది పనితీరు మండలంలో చర్చనీయాంశంగా మారుతుంది.
కొండాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే స్టాఫ్ నర్స్ దూర ప్రాంతం నుండి వస్తూ నెలలో రెండు, మూడు రోజులు విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు కొంతమంది రోగులు వాపోతున్నారు.
స్టాఫ్ నర్స్ నిర్దేశిత సమయంలో విధులకు హాజరు కాకుండా నెలలో రెండు మూడు రోజులు విధులను నిర్వహించుకొని నిత్యం విధులకు హాజరవుతున్నట్లు రికార్డులో సంతకాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా స్టాఫ్ నర్స్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తమను అడిగే నాథుడు ఎవరని వ్యవహరిస్తున్న తీరు కొత్త సమస్యలు తెస్తోంది. ఉన్నతాధికారుల అండదండలతోనే కొండాపూర్ పిహెచ్ సి లో ఈ వ్యవహారం నడుస్తుందని తెలుస్తోంది. ఈ ప్రభావం ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల తీవ్రంగా పడుతున్నట్లు పలువురు వాపోతున్నారు.
మా దృష్టికి వచ్చింది... ఫిర్యాదు చేశాం..
అర్చన, మండల వైద్యాధికారి
స్టాఫ్ నర్స్ వ్యవహారం పై కొండాపూర్ మండలం వైద్యాధికారి అర్చనను వివరణ కోరగా తాను నూతనంగా వచ్చానని ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ పనితీరు ఈ మధ్యనే తన దృష్టికి వచ్చిందన్నారు. అతను దూరం నుండి విధులకు హాజరవుతారని ఈ వ్యవహారంపై జిల్లా వైద్యాధికారికి సైతం నివేదికను పంపాను అన్నారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారిని సంప్రదించేం దుకు విజయక్రాంతి ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.






