26 August, 2026 | 2:06 AM

సర్కార్‌పై సమరమే

26-08-2026 01:16 AM
  1. రూ.15 వేల కోట్ల విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయకుంటే సచివాలయం ముట్టడి
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 
  3. అస్వస్థత.. వైద్యుల సూచన మేరకు దీక్ష విరమణ
  4. నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసిన లక్ష్మణ్, ఈటల, ఏలేటి, పాయల్ శంకర్ 

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): నిరాహార దీక్ష విరమించినా విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరాటం ఆగదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘ఫీజు బకాయి లడాయి’ పేరుతో చేపట్టిన నిరాహార దీక్షను ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం విరమించారు. 

వైద్యుల సూచన, పార్టీ ముఖ్య నేతల ఒత్తిడి మేరకు.. ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, విద్యార్థులు, నాయకులు నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి రూ.15 వేల కోట్ల బకాయిలను పైసా లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు.

అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపబోమని, కాంగ్రెస్ సర్కార్‌ను నిద్రపోనివ్వమని హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరగకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ మెడలు వంచుతామని స్పష్టం చేశారు. తన పోరాటానికి అండగా నిలిచిన విద్యార్థులు, యువత, మేధావులు, విద్యాసంస్థల ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

యువతను రెచ్చగొడుతున్న రాహుల్: ఎంపీ లక్ష్మణ్

దేశ యువతను రాహుల్‌గాంధీ రెచ్చగొడుతున్నారని బీజేపీ ఎంపీ.డా.కె.లక్ష్మణ్ మండిపడ్డారు. దేశం మొత్తం తిరుగుతున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణకు వచ్చి విద్యార్థులకు సమాధానం ఎందుకు చెప్పడంలేదని, తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చి రాష్ట్రంలోని యువతకు హామీలిచ్చి మోసం చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులను పట్టించుకోలేదు కానీ, విదేశీ విద్యాసంస్థలను తీసుకొస్తా అంటున్నారని విమర్శించారు.

దేశ ప్రజలను  రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని, తెలంగాణ సెంటిమెంట్‌తో రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు ఊరుకోరన్నారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదని, యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ సీఎంలకే విదేశీ పర్యటనకు అనుమతివ్వలేదని గుర్తు చేశారు.

నిరహార దీక్ష కార్యక్రమానికి వివిధ వర్గాల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పేద తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసేంత వరకు బీజేపీ పోరు ఆగదని ఆయన స్పష్టం చేశారు. 

సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం: కేంద్రమంత్రి బండి సంజయ్

ఫీజు బకాయిలు అందక ఉన్న కాలేజీలు మూత పడుతుంటే ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలను రాష్ట్రానికి రప్పించాలనుకుంటే కేంద్రం అడ్డుకుంటోందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం  హాస్యాస్పదమని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్ సహా వేలాది కాలేజీలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయాయని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న  లక్షల మంది విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద సెటిల్ చేసే బాధ్యతను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నా.. ఇకపై ఈ విద్యా సంవత్సరం నుండే బకాయిలను వన్‌టైంలో నిర్ణీత వ్యవధిలో చెల్లిస్తానని మాట ఇస్తున్నా.

ఈ మేరకు ఇక్కడి నుండే ఆర్థిక శాఖకు ఆదేశాలిస్తున్నా’ అని రెండేళ్ల క్రితం అసెంబ్లీలో, వివిధ బహిరంగ వేదికల్లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. హామీలివ్వడం మోసం చేయడంలో గత బీఆర్‌ఎస్ సర్కార్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మించిపోయిందన్నారు. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు ఆధ్వర్యంలో త్వరలోనే  పోరాటం ఉధృతం చేయబోతున్నామని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 5,6 తేదీల్లో నిరసన దీక్షలు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

 రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా, ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మరో పోరాటం చేయనున్నట్లు  బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అదే నెల 7న ’అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమం నిర్వహిస్తామని  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మంగళవారం రాంచందర్‌రావు దీక్షలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్రంలో సమస్యలు తాండవిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 22ఏ నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాల భూములను చేర్చి రైతులు, పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ కుంభకోణంలో రెవెన్యూ మంత్రిని సీఎం ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు.

లండన్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఎవరెవరిని కలిశారు, ఏయే విద్యాసంస్థలతో, కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి విద్యావ్యవస్థను సీఎం గాలికొదిలేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో సరిపడా బోధన సిబ్బంది లేరన్నారు. 9 వేల మంది విద్యార్థులున్న బాసర ట్రిపుల్ ఐటీలో.. కేవలం 19 మంది అధ్యాపకులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీకు గత ప్రభుత్వం రూ.250 కోట్ల బడ్జెట్ ఇస్తే, ప్రస్తుత ప్రభుత్వం  కేవలం రూ.40 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. ఐఐటీలతో పోటీ పడే స్థాయిలో విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తామని చెప్పడం కాదు.. ముందుగా బోధకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

హామీలను అమలు చేయకుండా.. ప్రతి విషయానికీ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని నిందించే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ సర్కార్‌కు అలవాటుగా మారిందన్నారు. ముందుగా తెలంగాణలోని 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని హితవు పలికారు.

సీఎం అంటే అర్థం తెలుసా?: ఎంపీ ఈటల రాజేందర్

‘సీఎం రేవంత్‌రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతున్నారు. ముందు తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి గురించి ఆలోచించాలి’ అని ఎంపీ ఈటల రాజేందర్ హితవు పలికారు. రేవంత్‌కు ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. నాలుగు కోట్ల మంది ప్రజల గరించి ఆలోచించాల్సిన రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు.

తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులకున్న సోయి.. ముఖ్యమంత్రిగా నీకు లేకపోవడం చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని విమర్శించారు. 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటమాడొద్దన్నారు. దేశంలోని పిల్లలకు నాణ్యమైన విద్య అందితే.. రేషన్ కార్డులు అక్కర్లేకుండా, ఆరోగ్యశ్రీ కార్డులు అక్కర్లేకుండా.. తమ కాళ్ల మీద తాము బతికే శక్తి వస్తుందని నమ్మిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు.

‘నా విద్యార్థులు, నా యువత ఆరోగ్యవంతులుగా ఉండాలి’ అని కలలు కంటున్న నాయకుడు మోదీ అని వివరించారు. పేద తల్లిదండ్రుల పిల్లలు కూడా గొప్పగా చదువుకుని డాక్టర్లు, ఇంజినీర్లు, అడ్వకేట్లు, ఉన్నతాధికారులు కావాలని కలలుకంటున్నారని తెలిపారు.

దీక్షకు అనుమతివ్వకపోవడం దారుణం: మురళీధర్‌రావు 

ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో రాంచందర్‌రావు దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ నాయకుడు పి.మురళీధర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్లినా చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణలో మాత్రం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎందుకు కనిపించడం లేదు? అని ప్రశ్నించారు.

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో సరిగ్గా నాణ్యమైన విద్య లభించకపోతే.. బయట దేశాల్లోని ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌కు రావడానికి కూడా వెనుకడుగు వేస్తాయనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలన్నారు.

బంగారం తాకట్టు పెట్టి ఫీజులు : బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి

తల్లిదండ్రులు తమ పిల్లల సర్టిఫికెట్ల కోసం బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి కళాశాలలకు ఫీజులు కడుతున్నారని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.యశస్వి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేటీఆర్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు బకాయిల కోసం సేకరించిన సంతాల ప్రతులతో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ నివాసం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.