26 August, 2026 | 5:08 AM

యుద్ధప్రాతిపదికన దేవాదుల పనులు.. ఏడాదిలో పూర్తి

26-08-2026 01:12 AM

రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించాలి

  1. అడ్డంకులన్నీ తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
  2. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్.. అటవీ సమస్యల పరిష్కారానికి నిధుల కొరత రానివ్వం
  3. దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు
  4. కలెక్టర్లు, ఇంజినీర్లు సమన్వయంతో పనిచేయాలి
  5. రైతుల చేతికి పరిహారం చేరడమే ప్రభుత్వ లక్ష్యం
  6. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి) : దాదాపు రెండు దశాబ్దాలుగా పూర్తిస్థాయిలో ఫలాలు అందించలేకపోతున్న దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాల న్న దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దేవాదుల ప్రాజెక్టును ఫాస్ట్రాక్‌పై పెట్టి  ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

దేవాదుల ప్రాజెక్టుపై మంగళవారం  సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, బలంరాంనాయక్, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర సాగునీటి చరిత్రలో అత్యంత కీలక మైన ప్రాజెక్టుల్లో దేవాదుల ప్రాజెక్టు  ఒకటని పేర్కొన్నారు.

గోదావరి జలాలను ఎత్తిపోసి తెలంగాణలోని విశాలమైన ప్రాంతానికి సాగునీటి భరో సా కల్పించాలన్న లక్ష్యంతో దేవాదుల రూపుదిద్దుకున్నదని, దాదాపు రెండు దశాబ్దాల క్రితం చేప ట్టిన ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ అసంపూర్తిగా మిగిలిపోవడం దురదృష్టకరమన్నారు. ఇకపై జాప్యానికి తావులేకుండా, ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టంచేశారు.

సుమారు 38 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి, దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో దేవాదుల పథకం రూపుదిద్దుకుందని తెలిపారు. హనుమకొండ, వరంగల్, కరీంనగర్, జనగామ, యాదాద్రి- భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ -మల్కాజిగిరి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలకు ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు విస్తరించనున్నాయని వివరించారు.

ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారం.. 

దేవాదుల ప్రాజెక్టును కేవలం సమీక్షించడానికే పరిమితం కాకుండా, ప్రతి కాంపోనెంట్‌ను విడివిడిగా పరిశీలించి, ఏ పని ఎక్కడ నిలిచిపోయింది..? దానికి కారణమేంటి..? పరిష్కారానికి ఏం చేయాలి..? అనే అంశాలపై లోతుగా చర్చించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రధానంగా భూసేకరణ, -పునరావాస ప్యాకేజీ , అటవీ అనుమతులు, ఇతర పరిపాలనా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల్లో భూసేకరణ తదితర అడ్డంకులను తొలగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రూ. 6 వేల  కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి హామీ ఇచ్చారని, అం దులో ఇప్పటికే సుమారు రూ.2,500 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టుకు కూడా ఇటీవల భూసేకరణ కోసం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అవసరమైన ప్రక్రియలు పూర్తయిన వెంటనే మిగిలిన నిధులను సైతం సమకూరుస్తామని భరోసా ఇచ్చారు.

భూసేకరణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే అంతిమ లక్ష్యం కాదని, భూములు కోల్పోయిన రైతులు, ని ర్వాసితుల చేతికి పరిహారం సకాలంలో చేరినప్పుడే ప్రభుత్వ సంకల్పం సార్థకమవుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశంపై కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖలు, జిల్లా కలెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

గరిష్ఠంగా ఎత్తిపోస్తాం.. 

దేవాదుల సమీక్షలో మరో కీలక నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పంపింగ్ వ్యవస్థలన్నింటినీ పూర్తి సామర్థ్యంతో వినియోగించి, గోదావరి నుంచి సాధ్యమైనంత గరిష్ఠ పరిమాణంలో నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు, ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లకు చేరవేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దేవాదుల అమలులో ఎదురైన సమస్యలను సమీక్షలో క్షుణ్ణంగా విశ్లేషించామని, మిగిలిపోయిన ప్రతి అడ్డంకిని అధిగమించేందుకు ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించినట్లు చెప్పారు.

ఇకపై విధానపరమైన, పరిపాలనా లేదా కాంట్రాక్టు సంబంధిత సమస్యల పేరుతో దేవాదుల పనులు సాగదీయడానికి అవకాశం ఉండదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. గోదావరి జలాలను గరిష్ఠంగా ఎత్తిపోయడం ద్వారా  ఈ చారిత్రక ప్రాజెక్టు ఫలాలను సాధ్యమైనంత త్వరగా రైతుల పొలాలకు చేరుస్తామని మంత్రి తెలిపారు.