వేటు వేయండి!
- కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు
- ఇద్దరినీ పదవుల నుంచి తప్పించాలని సూచన
- పీసీసీ అధ్యక్షుడికి నివేదిక
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇద్దరు నేతల వ్యవహారశైలిపై సమగ్రంగా పరిశీలించిన కమిటీ.. పార్టీ ప్రతిష్ఠకు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్‌మోహన్ రూపొందించిన నివేదికను మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అందజేశారు.
మంత్రి కొండా సురేఖను గతంలోనూ పార్టీ పెద్దలు హెచ్చరించినా ఆమె వ్యవహారశైలిలో మార్పు రాలేదని, తాజాగా ఆమె కుమార్తె చేసి న వ్యాఖ్యలనూ సురేఖ ఖండించలేదని కమిటీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వరుసగా పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని నివేదికలో సిఫార్సు చేసినట్లు సమాచారం.
చిన్నారెడ్డిపైనా చర్యలకు సిఫార్సు
సీనియర్ నేతగా సుదీర్ఘకాలం పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించిన చిన్నారెడ్డి.. గతంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. అలాంటి నాయకుడే పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడటం సమర్థనీయం కాదని కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ హోదా కలిగిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.
పార్టీ అంతర్గత వ్యవహారాలు బహిరంగ చర్చకు రావడం, ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలను క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. హద్దులు దాటే నేతలందరికీ ఒకే విధమైన స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాలని, భవిష్యత్తులో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.
అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ
కొండా సురేఖ, చిన్నారెడ్డి నుంచి తీసుకు న్న వివరణలను పరిశీలించిన అనంతరం క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు సమర్పించింది. ఆయన ఈ నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు ఏఐసీ సీ పెద్దలకు పంపనున్నారు. తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకోనుండటంతో ఇద్దరు నేతలపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు పార్టీలో ఉత్కంఠగా మారింది.
వ్యక్తులు కాదు.. క్రమశిక్షణ ముఖ్యం : మల్లు రవి
పార్టీలో వ్యక్తుల కంటే క్రమశిక్షణే ముఖ్యమని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై వారు ఇచ్చిన వివరణ, చోటు చేసుకున్న పరిణామాలతో పూర్తి నివేదికను పీసీసీ అధ్యక్షుడికి అందజేశామని తెలిపారు. మంగళవారం ఆయన గంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యమని, పార్టీ నేతలు సమన్వయంతో, బాధ్యతాయుతంగా నడుచుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని.. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని స్పష్టం చేశారు. నివేదికలోని అంశాలను ముందే వెల్లడించకూడదని, ఇది పార్టీ నియమావళికి విరుద్ధమని మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను బయటపెడితే తనకూ నోటీసులు పక్కా అని పేర్కొన్నారు.
తనను ఎవరూ వ్యక్తిగతంగా కలవలేదని, గాంధీభవన్‌కు వచ్చి వివరణ లేఖలు మాత్రమే ఇచ్చి వెళ్లారని వెల్లడించారు. క్రమశిక్షణ కమిటీ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి ఇవ్వలేదని, ఇది పార్టీకి సంబంధించిన అంశం కావడంతో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌కు మాత్రమే అందజేశామని చెప్పారు. ఆయన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇస్తారని వివరించారు. మీడియా ఊహాజనిత కథనాలు రాయవద్దని విజ్ఞప్తి చేశారు.






