26 August, 2026 | 1:33 AM

పీఏసీఎస్‌ చైర్మన్‌గా అనంతరెడ్డి

26-08-2026 12:16 AM

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి: షబ్బీర్‌ అలీ

నూతన చైర్మన్‌కు సన్మానం

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) నూతన చైర్మన్‌గా అనంతరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు షబ్బీర్‌ అలీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ నూతన చైర్మన్‌ అనంతరెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

రైతులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు, రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.పీఏసీఎస్‌లు కేవలం రుణాలు అందించే సంస్థలుగా కాకుండా రైతుల ఆర్థిక అభివృద్ధికి, వ్యవసాయ రంగం బలోపేతానికి కీలక కేంద్రాలుగా పనిచేయాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపాలని అన్నారు. సహకార సంఘం కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారితనం పాటిస్తూ ప్రతి రైతుకు సమానంగా సేవలు అందించాలని సూచించారు.

ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వ సహకారం అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.అనంతరం నూతన పీఏసీఎస్‌ చైర్మన్‌ అనంతరెడ్డిని షబ్బీర్‌ అలీ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఐరన్‌ నరసయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆశపోయిన శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్‌, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు తదితరులు పాల్గొన్నారు.