26 August, 2026 | 3:24 AM

సెప్టెంబర్ 7 డెడ్‌లైన్

26-08-2026 01:09 AM
  • అప్పటిలోగా 22 ఏ నుంచి పేదల భూములు తొలగించాలి 
  • పరిష్కరించకపోతే లక్షల మందితో అసెంబ్లీ ముట్టడి 
  • పేదల ఆస్తులపై కన్నేస్తే ప్రజలే ప్రభుత్వాన్ని నిషేధిస్తారు 
  • కుత్బుల్లాపూర్‌లో 22 ఏ బాధితుల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): 22 ఏ నిషేధిత జాబితా నుంచి పేదల భూములను తక్షణమే తొలగించాలని, ఇందుకు సెప్టెంబర్ 7 వరకు డెడ్‌లైన్ విధిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పేర్కొన్నారు. అప్పటిలోగా సమస్యను పరిష్కరించకపోతే లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడి స్తామని హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అకారణంగా 22- ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు వెంటనే విముక్తి కల్పించాలని, ఈ వ్యవహారంపై  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మంగళవారం షాపూర్‌నగర్‌లోని ఎంజే గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధ్యక్షతన నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 22- ఏ బాధితుల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో భూభారతి సాక్షిగా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 2022 నుంచి 22 ఏలో చేర్చిన, తొలగించిన సర్వే నంబర్ల పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

22- ఏ కేవలం రిజిస్ట్రేషన్ సమస్య కాదని, వేలాది మంది భూ యజమానుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యగా పేర్కొన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బుతో భూములు కొనుగోలు చేసి, చట్టబద్ధమైన పత్రాలు, పట్టాలు కలిగి ఉండి, పన్నులు చెల్లిస్తున్న వారి భూములను 22- ఏ జాబితాలో చేర్చడం దారుణమన్నారు.

కుటుంబ అవసరాలకు భూములను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్ చేసుకోలేక, రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22- ఏ అంటే నంబర్ మాత్రమే కాదని, కుటుంబం భవిష్యత్తుకే పడే తాళమని పేర్కొన్నారు.  నిషేధిత జాబితా నుంచి పేదల భూములు తొలగించకపోతే, వారే ప్రభుత్వాని నిషేధిస్తారని హెచ్చరించారు.

మీకు రియల్ ఎస్టేటే తెలిస్తే.. మాకు పోరాటాలు తెలుసు

‘మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడ మే తెలుసు. కానీ మాకు పోరాటాలు కూడా అనుభవమే. ప్రజల పక్షాన ఎలా పోరాడాలో బాగా తెలుసు’ అని హరీశ్ రావు స్పష్టం చేశా రు. 22 ఏ విషయంలో ప్రభుత్వం తప్ప చేయకపోయినా, సీఎం రేవంత్‌రెడ్డి పాత్ర లేకపోయినా సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.  22 ఏ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, సెప్టెంబర్ 7లోగా లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

అసెంబ్లీలో కొట్లాడుతాం.. బయట బీఆర్‌ఎస్ శ్రేణులు పోరాడుతాయి. బాధితులకు కంటికి రెప్పలా బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంద ని హరీశ్ రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత బాధ్యులను గుర్తించి శిక్షి స్తాం  స్పష్టం చేశారు. ప్రజల భూములపై కన్నేసినా, హక్కులను హరించినా సహించేది లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, గోరేటి వెంకన్న, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారె డ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.