భూ భారతి రీ-సర్వే ద్వారా భూముల హక్కులకు శాశ్వత పరిష్కారం
-జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
కోరుట్ల/జగిత్యాల, జూలై24 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి రీ-సర్వే కార్యక్రమం శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామంలోని సంగమేశ్వర ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సు నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూరీ-సర్వే ద్వారా గ్రామంలోని అన్ని భూములను శాస్త్రీయ పద్ధతిలో కొలిచి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మ్యాపులను రూపొందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు చురుకుగా పాల్గొని సర్వే బృందానికి గ్రామ ప్రజలు, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.భూభారతి రీ-సర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దు (విలేజ్ బౌండరీ) శాశ్వతంగా నిర్ధారిస్తారు.
అనంతరం గ్రామ కంఠం (ఇళ్ల విస్తీర్ణం ఉన్న ప్రాంతం)లోని ప్రతి ఇంటిని ఆధునిక సర్వే పరికరాల ద్వారా మళ్లీ కొలిచి పాయింట్లు నమోదు చేసి, గ్రామంలోని ఇళ్ల సరిహద్దులను ఖరారు చేస్తామని తదుపరి దశలో ప్రభుత్వ భూముల సరిహద్దులను గుర్తించి సర్వే నిర్వహిస్తామని ఇందులో ప్రభుత్వానికి చెందిన చెరువులు, కాలువలు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, పోరంబోకు భూములు మరియు ఇతర ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఖచ్చితంగా మ్యాపింగ్ చేసి నమోదు చేస్తామని గ్రామ కంఠం ప్రభుత్వ భూముల సర్వే పూర్తయిన తర్వాత పట్టా భూముల రీ-సర్వే ప్రారంభమవుతుందని ఇందుకోసం ప్రతి రైతుకు భూ భారతి చట్టం ప్రకారం 9(1) నోటీసు జారీ చేసి ముందస్తు సమాచారం ఇస్తామని నోటీసులో పేర్కొన్న తేదీ, సమయానికి రైతులు తప్పనిసరిగా తమ భూమి వద్ద హాజరుకావాలని సూచించారు.
సర్వే సమయంలో రైతు ప్రస్తుతం అనుభవిస్తున్న భూమి ఆకృతి, హద్దులు, మూలల పాయింట్లు, భూమి యొక్క వాస్తవ స్థితిని ఆధునిక సర్వే పరికరాల సహాయంతో నమోదు చేసి, ఖచ్చితమైన కో-ఆర్డినేట్లతో కొత్త డిజిటల్ మ్యాపులు రూపొందిస్తామని తెలిపారు,ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపిడివో, రెవెన్యూ అధికారులు, పాల్గొన్నారు.






