26 February, 2026 | 5:53 PM

తహసీల్దార్, ఆర్డీవో శాశ్వత భవనాలు

26-02-2026 12:51 AM
  1. ప్రజలకు గౌరవప్రదమైన సేవలే లక్ష్యం

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రాష్ర్టంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే రెండో విడతలో శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి డిజైన్లకు తుదిరూపు ఇస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ‘ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదు.

ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలి’ అన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు.

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్- పఠాన్ చెరువులలో భవనాలకు శంకుస్థాపన పూర్తయ్యిందన్నారు. గచ్చిబౌలిలో మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు. రాష్ర్టంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.