పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!
బాటిల్లు డబ్బాల్లో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్న వాహనదారులు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా దాడుల నేపథ్యంలో భారత దేశంలో ఇంధన కొరత, ధరల పెరుగుదల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ఆయా పెట్రోల్ బంకుల్లో(petrol pumps) ఇంధన కొరత ఉన్నట్లు నో స్టాక్ బోర్డులు తగిలించారు. దీంతో వాహనదారుల్లో మరింత ఆందోళన పెరగడంతో బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం కార్లు, బైకులు, ఆటోలు క్యూలో నిల్చున్నాయి.
మరి కొంతమంది వాహనదారులు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయడంతో పాటు ఇతర బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఇతర వస్తువుల క్రయ విక్రయ ధరల్లోను తీవ్ర ప్రభావం చూపుతోందని సామాన్యులు మండిపడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతలు, నాణ్యత వంటి ప్రమాణాలు పాటించకపోయినా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సామాన్యులు మండిపడుతున్నారు.




