15 June, 2026 | 10:53 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?

15-06-2026 09:35 PM

- నలుగురిపై దాడి.. చనిపోయాడని భావించి ఒకరిని వాగులో పడేసిన దుండగులు

భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో నకిలీ విత్తనాల దందా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దందా గురించి పోలీసు అధికారులు, ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారనే కక్షతో నలుగురు వ్యక్తులపై దాడి జరిగినట్లు బాధితులు ఆరోపించారు. ఈ మేరకు డీసీపీకి ఫిర్యాదు సమర్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. బాధితులు తెలిపిన కథనం ప్రకారం... కేస్లాపూర్ గ్రామానికి చెందిన ఇందూరి రాజశేఖర్, ముత్యం రాజశేఖర్, మాడే రాజు, గోసుల మల్లేశ్‌లు ఈ నెల 14న రాత్రి కేస్లాపూర్ నుంచి వెంకటాపూర్ వెళ్తుండగా రాజారం గ్రామ శివారులో కొందరు వ్యక్తులు దారికాచి అడ్డగించారు.

సుమారు 20 మంది కలిసి కర్రలు, ఇనుపరాడ్లు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ముత్యం రాజశేఖర్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, అతను మరణించాడని భావించిన దుండగులు సమీపంలోని వాగులో పడేసినట్లు బాధితులు తెలిపారు. మిగతా ముగ్గురిపై కూడా దారుణంగా దాడి చేసి తీవ్ర గాయాలకు గురి చేశారు. దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న భీమిని ఎస్ఐ కోటేశ్వర్ ఘటన స్థలానికి చేరుకుని గొడవను అడ్డుకుని గాయపడిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. నకిలీ విత్తనాల దందాను బయట పెడుతున్నందుకే తమపై హత్యాయత్నం జరిగిందని బాధితులు పేర్కొంటూ, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భీమిని, కన్నెపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న నకిలీ విత్తనాల మాఫియాపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని డీసీపీని సోమ వారం కోరారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.