ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 68 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
అందిన వినతులపై వచ్చే సోమవారం నాటికి చర్యలు పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజావాణి ద్వారా అందిన ప్రతి దరఖాస్తును పోర్టల్‌లో నమోదు చేసి, దరఖాస్తుదారులకు రశీదు అందజేయాలని తెలిపారు. సమస్యల పరిష్కార ప్రక్రియలో పారదర్శకత పాటించడంతో పాటు, శాఖల వారీగా తీసుకున్న చర్యల వివరాలను కూడా పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి వినతిని ప్రాధాన్యతగా తీసుకుని నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించాలని, నిర్లక్ష్యం లేదా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.






