భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం
- సుడిగాలితో భారీ నష్టం.. తప్పిన ప్రాణాపాయం
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులు శ్రీ సీతారామాంజనేయ ఇండస్ట్రీస్ పారాబాయిల్డ్ రైస్ మిల్లుకు తీవ్ర నష్టం కలిగించాయి. సుడిగాలితో మిల్లు షెడ్డు, భారీ మిషనరీ, ఇనుప పైపులు, నిర్మాణాలు ఒక్కసారిగా కుప్పకూలడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు రైస్ మిల్లు యాజమానులు బిల్లాకంటి రాజ్యలక్ష్మి, రవికుమార్ తెలిపారు.
సాయంత్రం 5.30 గంటల సమయంలో వచ్చిన సుడిగాలి మిల్లును చుట్టు ముట్టడంతో పైకప్పు ఎగిరిపడగా, భారీ మోటర్లు, పైపులు నేలకూలాయి. మిల్లులో ప్రాసెసింగ్‌లో ఉన్న వడ్లు, బియ్యం పూర్తిగా తడిసిపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల మేర నష్టం జరిగినట్లు యాజమానులు చెబుతున్నారు. వర్షం, ఈదురు గాలులు వీచిన సమయంలో మిల్లులో కార్మికులు విధుల్లో ఉండగా, యాజమాన్యం అప్రమత్తమై వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పెను ప్రాణాపాయం తప్పిందన్నారు.






