17 August, 2026 | 10:35 PM

అర్హులైన బీడీ కార్మికులందరికీ పింఛన్ ఇవ్వాలి

17-08-2026 08:32 PM

మల్లాపూర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): అర్హులైన బీడీ కార్మికులందరికీ పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లాపూర్ మండల కేంద్రంలోని భారతమాత కూడలి వద్ద బీఆర్ఎస్ నాయకులు, బీడీ కార్మికులు ధర్నా చేపట్టారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బీడీ కార్మికులకు నూతన చేయూత పింఛన్ పథకంలో అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

అర్హత ఉన్న ప్రతి బీడీ కార్మికులకి పింఛన్ మంజూరు చేయడంతో పాటు వితంతు, వికలాంగుల పింఛన్ల మాదిరిగానే బీడీ కార్మికుల పింఛన్‌ను కూడా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 31వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. అనంతరం బీడీ కార్మికులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు, మహిళలు ఎంపీడీఓ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. అర్హులైన కార్మికులందరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.