17 August, 2026 | 9:13 PM

ఓటేసిన పాపానికి దళితులపై దౌర్జన్యమా...

17-08-2026 06:56 PM

దళిత రైతులకు చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అన్యాయం

పేదల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భౌరంపేట్ గ్రామం సర్వే నెంబర్ 472 ను సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్, ఆగష్టు 17(విజయక్రాంతి): పేదల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని భౌరంపేట్ గ్రామం సర్వే నెంబర్ 472 లోని భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై భౌరంపేట్ దళిత రైతులు సోమవారం ధర్నాకు దిగారు. ధర్నా కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని, రైతులకు మద్ధతు తెలిపి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ భౌరంపేట్ గ్రామంలో సర్వే నెంబర్ 472,166 లలో భూమిని దళితులకు ఇచ్చారని పేర్కొన్నారు. ఐదు తరాల నుండి ఈ భూముల్లో దళితులు వ్యవసాయం చేసుకుంటూ టాక్స్ కడుతున్నారని తెలిపారు.

దళిత భూముల వైపు కన్నెత్తి సాహసం ఎవరూ చేయలేరు కానీ...ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ పని చేస్తుందని ఆరోపించారు. ఒక్కప్పుడు ప్రభుత్వ అవసరాలకు దళితుల భూమి తీసుకుంటే నష్ట పరిహారం చెల్లించేవారని... కేసీఆర్ వచ్చాక ఆ పధ్ధతి మార్చి ల్యాండ్ బ్రోకర్ గా మారిపోయి ఎకరానికి నాలుగు వందల గజాలు మాత్రమే ఇచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే మహిళలకు 2500 రూపాయలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, 4000 రూపాయల నిరుద్యోగభృతి అనేకం వస్తాయని భ్రమించి ఓటేస్తే... కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లు అయ్యిందన్నారు.

ప్రభుత్వ భూమి అంటే ప్రజలది తప్ప రేవంత్ రెడ్డి, కేసీఆర్ ది కాదు. ఒకవైపు పేదలకు ఇళ్ళు కట్టిస్తామని, అనేక పనులు చేపిస్తామని చెప్పి ఇంకొక వైపు పేదల భూములు ఎందుకు గుంజుకుంటున్నారని ప్రశ్నించారు. భౌరంపేట్ దళిత రైతులకు ఎంపీగా తను, బీజేపీ పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కృష్ణారెడ్డి,మంగమ్మ, సుధాకర్ గాండే, వాసు, రాజిరెడ్డి, మల్లేష్, సతీష్, శివాజీ, ప్రభాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, జంగారెడ్డి, రామచంద్రా రెడ్డి, రైతులు జీతారం, వీరయ్య, జీతయ్య, బలరాం, బాలేష్ తదితరులు పాల్గొన్నారు.