17 August, 2026 | 9:44 PM

నానో ఎరువులతో తగ్గనున్న సాగు ఖర్చులు...

17-08-2026 07:20 PM

- ఆత్మ ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శన

హాజీపూర్, (విజయక్రాంతి): రైతులు నానో ఎరువుల (NANO FERTILIZER) ను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చునని హాజీపూర్ వ్యవసాయ అధికారి (MAO) క్రిష్ణ తెలిపారు.

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షేత్ర ప్రదర్శనలో డ్రోన్ సహాయంతో నానో యూరియా (UREA), నానో డీఏపీ (DAP) వినియోగించే విధానం, పంట దశల ప్రకారం ఎరువుల మోతాదు వివరాలను రైతులకు తెలియచేశారు. డ్రోన్ సహాయంతో స్ప్రే చేయడం ద్వారా రైతులు పెట్టుబడి ఖర్చుని తగ్గించుకోవచ్చునని సూచించారు. ఎల్ నినో దృష్ట్యా రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన పప్పు దినుసులు, ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దొనబండ AEO కొమురయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.