17 August, 2026 | 10:34 PM

రూ.24 కోట్ల18 లక్షల ధాన్యం దుర్వినియోగ్యానికి పాల్పడిన ఇరువురి అరెస్ట్

17-08-2026 09:38 PM

వివరాలు వెల్లడించిన డిసిపి రాంరెడ్డి 

సుల్తానాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో డీసీపీ భూక్యా రామ్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రూ.24 కోట్ల 18 లక్షల విలువైన ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగానికి సంబంధించి సుగులాంపల్లి గ్రామంలో గల లక్ష్మీ రైస్ మిల్లు నిర్వాహకులు మధు, రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్‌కు అప్పగించిన ప్రభుత్వ ధాన్యాన్ని లెక్కల్లో చూపకుండా దారి మళ్లించినట్లు పోలీసులు నిర్ధారించారు. మొత్తం 10,015.636 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లర్‌కు అప్పగించగా... దానికి బదులుగా ప్రభుత్వానికి 6,662.880 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం అందించాల్సి ఉంది.

అయితే కేవలం 1,577.289 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి అందించినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా 5,020.719 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయిగా ఉందని... 7,493.610 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని డిఫాల్ట్‌గా గుర్తించినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి మొత్తం రూ.24,18,59,070 నష్టం జరిగినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సమావేశంలో ఎసిపి గజ్జి కృష్ణ, సీఐ రంజిత్ రావు, ఎస్సై చంద్ర కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...