5 August, 2026 | 3:38 AM

రూ.48 కోట్ల విలువైన ధాన్యం మాయం

05-08-2026 12:32 AM
  1. శ్రీశ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీస్‌లో తనిఖీలు 
  2. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో సోదాలు 

మేళ్లచెరువు, ఆగస్టు 4 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా  మేళ్లచెరువులోని శ్రీ శ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీస్ మిల్లులో మంగళవారం రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్, జిల్లా పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోట్ల రూపాయల ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. 2022 రబీ కాలంలో, 2024 ఖరీఫ్ కాలంలో సంబంధించిన ధాన్యం, నిల్వలను పరిశీలించగా ఆన్‌లైన్ రికార్డులు, స్టాక్ వివరాలు, మిల్లులో భౌతికంగా ఉన్న నిల్వల మధ్య భారీవ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు.ప్రాథమిక పరిశీలనలో ఆక్షన్ ధాన్యాన్ని మినహాయించి, సుమారు 19,843.429 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం అందుబాటులో లేకపోవడం అధికారులు గుర్తించారు.

మాయమైన ధాన్యం విలువ సుమారు 48 కోట్లుగా ఉంటుందని దానితో పాటుగా ప్రభుత్వ బకాయిలు కలిపి సుమారు 53.66 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం తుది నివేదికను సంబంధిత ప్రభుత్వానికి సమర్పించి నిబంధన ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలలో రీజినల్ విజిలెన్స్ అధికారి ప్రతాప్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గౌస్, జిల్లా పౌరసరఫరాల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.