రైతులను నిలువునా ముంచుతున్న వడ్ల కొనుగోలు సెంటర్లు
- అక్రమాలకు పాల్పడుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- బీసీ జేఏసీ చైర్మన్ సిద్ధి రమేష్ యాదవ్
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని పలు గ్రామాలలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులను తీవ్రంగా దోపిడీ చేయడం బాధ కలిగిస్తోందని బీసీ జేఏసీ చైర్మన్ సిద్ధి రమేష్ యాదవ్ శనివారం ఆరోపించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తుంటే, అక్కడి నిర్వాహకులు అనేక అక్రమాలకు పాల్పడుతూ రైతులను నిలువునా ముంచుతున్నారన్నారు. వడ్ల కొనుగోలు సమయంలో రైతులకు ట్రక్ సీడ్ ఇవ్వకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం అత్యంత అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
రైతులు ధాన్యాన్ని తరలించడానికి భారీ ఖర్చులు భరిస్తున్నప్పటికీ, ట్రక్ సీడ్ ఇవ్వకుండా కొనుగోలు చేయడం. హమాలి ఖర్చులు రైతులే భరించడం వల్ల రైతులకు అదనపు భారం అవుతుంది. అంతేకాకుండా ప్రతి 40 కిలోల బస్తాకు ఐదు కిలోల వరకు అక్రమంగా కటింగ్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా తరుగుదల పేరుతో రైతుల శ్రమను దోచుకోవడం దారుణమన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు మాత్రం ఈ అక్రమాలను చూసీ చూడనట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
రైతుల పట్ల ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ విధానాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, మధ్యవర్తులు, కొంతమంది నిర్వాహకుల వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల వద్ద నుంచి అక్రమంగా ఐదు కిలోల తరుగుదల చేస్తున్న సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరారు.
అదేవిధంగా ప్రతి కొనుగోలు కేంద్రంలో పారదర్శకంగా తూకాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు సరైన రసీదులు ఇవ్వాలని సూచించారు. రైతు దేశానికి వెన్నెముక అని ప్రతి ప్రభుత్వం చెబుతుంటే, క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి మాత్రం రోజురోజుకూ దయనీయంగా మారుతోందన్నారు. రైతుల కష్టానికి తగిన గౌరవం ఇవ్వకపోతే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే రైతు సంఘాలు, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.






